
కల్వకుంట్ల కుటుంబం సహా బీఆర్ఎస్ నేతల మితిమీరిన జోక్యం కారణంగా సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఉద్యోగాలను గణనీయంగా తగ్గించడం, ఆర్థిక పరిస్థితి పతనం, భద్రతాపరమైన లోపాలు వంటి అంశాలు మొత్తం వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చేశాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి సంరక్షణ నినాదమిచ్చిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు సంరక్షణ లేకపోగా సింగరేణి నిధుల భక్షణ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు రూ.3,500 కోట్ల మిగులు నిధులతో ఉన్న సింగరేణి 2023 జనవరి వరకు రూ.10వేల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోవడానికి కారణాలేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులు నిధులతో బంగారు గనిలా పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు.
ఈ తొమ్మిదేళ్లలో సింగరేణిలో వచ్చిన మార్పులపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాలకోసం సింగరేణిని బలిచేయడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటైందని మండిపడ్డాయిరు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉన్నప్పటికీ.. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఓవైపు సింగరేణి టర్నోవర్ పెరుగుతున్నా లాభాలు పెరగకపోవడానికి గల కారణాలేంటో కూడా చెప్పాలని నిలదీశారు. అప్పులు చేయకుండా ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వలేని దుస్థితికి సింగరేణిని తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. సింగరేణి కన్నా 10రెట్లు పెద్దదైన కోల్ ఇండియా లిమిటెడ్ కు ప్రస్తుతం రూ.12వేల కోట్ల అప్పులుంటే, సింగరేణికి రూ.10వేల కోట్లు అప్పులున్నాయని తెలిపారు.
కోల్ ఇండియా సంస్థలో పనిచేసే కార్మికుడికి రోజుకు రూ. 930 అందుతుంటే సింగరేణిలో కేవలం రూ. 420 మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ప్రతి అంశంలోనూ రాజకీయ జోక్యం పెరగడం కారణంగా.. ఒకప్పుడు తెలంగాణకు తలమానికంగా ఉన్న సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, నానాటికీ సమస్యలు ఎక్కువవుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు