కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలన్న ఆయన అభ్యర్థనను గుజరాత్‍లోని సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. “మోదీ ఇంటిపేరు” పేరుపై చేసిన వ్యాఖ్యల వల్ల రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలైంది.
ఈ కేసులో రాహుల్ గాంధీని మార్చిలో దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది మేజిస్ట్రేట్ కోర్టు. దీంతో దోష నిర్ధారణను నిలుపుదల చేయాలని ఆయన ఈ నెలలో సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సెషన్స్ కోర్టు రాహుల్ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ ఎంపీ పదవి పునరుద్ధణ జరగదు.
ఈ పరువు నష్టం కేసులో తనకు గరిష్ట శిక్షను విధించాల్సిన అవసరమే లేదని సెషన్స్ కోర్టుకు రాహుల్ గాంధీ విన్నవించారు. కింది కోర్టులో విచారణ సరిగా జరగలేదని పేర్కొన్నారు. ఈ కేసులో మేజిస్ట్రేట్ తీర్పు అసాధారణంగా ఉందని, రికార్డుల్లో ఉన్న ఆధారాలన్నింటినీ కలగాపులగం చేయడమే ఇందుకు కారణమని రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించారు.
ఏప్రిల్ 13న ఈ వాదనలు జరగగా గురువారం తీర్పు చెప్పింది సెషన్స్ కోర్టు. రాహుల్‍ను దోషిగా నిర్ధారించిన మెజిస్ట్రేట్ తీర్పునే సమర్థించింది. కింది కోర్టు తీర్పును నిలుపుదల చేయాలన్న రాహుల్ అభ్యర్థనను తిరస్కరించింది. సూరత్ సెషన్స్ కోర్టు తీర్పుతో తదుపరి చేపట్టాల్సిన చర్యలను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది.
ఈ విషయంపై పైకోర్టులకు వెళ్లేందుకు ఆలోచిస్తోంది. “చట్టం ప్రకారం మాకు అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటాం. రాహుల్ గాంధీ అప్పీల్ గురించి సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తాం” కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అప్పీలును సూరత్ కోర్టు తిరస్కరించడంపై స్పందిస్తూ సత్యమేవ జయతే అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా ట్వీట్ చేశారు.కోర్టులపై కాంగ్రెస్ మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతుందని ఆయన విమర్శించారు.
2019లో కర్ణాటకలో లోక్‍సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీలను ప్రస్తావిస్తూ ‘మోదీ ఇంటిపేరు’పై రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. “దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకు ఉంది?” అని ప్రశ్నించారు.
మోదీ వర్గాన్ని రాహుల్ అవమానించారంటూ సూరత్ జిల్లా కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పుర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు వేశారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో సూరత్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. రాహుల్‍ను దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీపై లోక్‍సభ అనర్హత వేటు వేసింది. దీంతో ఎంపీ పదవి కోల్పోయారు రాహుల్ గాంధీ.
రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వారు పార్లమెంటు సభ్యులుగా ఉండేందుకు అర్హత లేదనే చట్టం ఉంది. అలాగే వారు తదుపరి ఎనిమిదేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు. ఈ నిబంధనల కింద పరువు నష్టం కేసులో దోషిగా తేలి, రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీపై లోక్‍సభ అనర్హత వేటు వేసింది.
దీంతో రాహుల్ ఎంపీ పదవిని కోల్పోయారు. ఒకవేళ సూరత్ సెషన్స్ కోర్టు దోష నిర్ధారణపై స్టే విధించి ఉంటే ఆయనకు మళ్లీ ఎంపీ పదవి దక్కేది. అయితే సూరత్ సెషన్ కోర్టు రాహుల్ అప్పీలును తిరస్కరించింది. దీంతో పైకోర్టులను రాహుల్ గాంధీ ఆశ్రయించాలి.
దోష నిర్ధారణను పైకోర్టులు కొట్టేసినా, శిక్షను నిలుదల చేసినా, శిక్షను రెండేళ్ల కంటే తగ్గించినా రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీ పదవిని పొందవచ్చు. ఒకవేళ ఉన్నత న్యాయస్థానాలు కూడా రాహుల్ గాంధీ దోష నిర్ధారణను, శిక్ష అలాగే కొనసాగిస్తే ఆయన ఎంపీ పదవిని మళ్లీ పొందలేకపోవడమే కాక, తదుపరి 8 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు.
More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
ప్రజాస్వామ్యంలో పెరిగిపోతున్న వర్గ రాజకీయాలు
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!