కేజ్రీవాల్, ఆ తర్వాత కవిత తీహార్ క్లబ్ కు!

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లను టార్గెట్ చేస్తూ వరుసగా విడుదల చేస్తున్న సంచలన లేఖలలో భాగంగా శనివారం మరోలేఖను విడుదల చేసారు. తీహార్ క్లబ్ కు కవిత, కేజ్రీవాల్ కు స్వాగతమంటూ పేర్కొన్న సుఖేష్ “ముందు కేజ్రీవాల్ ఆ తరువాత నీ వంతే” అంటూ కవితను హెచ్చరించాడు.
 
ఎమ్మెల్సీ కవిత ఫోన్ నెంబర్లను చూపుతూ స్క్రీన్ షాట్ ను విడుదల  చేశాడు. ఇక త్వరలోనే కేజ్రీవాల్ తో చేసిన చాటింగ్ ను కూడా విడుదల చేస్తామని ప్రకటించాడు. కాగా, ట్విట్టర్ ద్వారా సమాధానం ఇవ్వవద్దని, ఇవన్నీ కూడా పాత ట్రిక్కులని కవితకు హితవు చెప్పాడు.
 
తనను దొంగ, ఆర్ధిక నేరగాడిగా విమర్శిస్తున్నారని కవితను ఉద్దేశించి పేర్కొంటూ కానీ అందులో మీరు భాగస్వాములే అని స్పష్టం చేశాడు. దైర్యం ఉంటే సరైన రీతిలో సక్రమంగా విచారణకు సహకరించాలని కవితకు సవాల్ విసిరారు. కవితను ‘కవితక్క’ అని సంబోధించానని కానీ దేశం ప్రయోజనాల రీత్యా ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నానని సుఖేష్ పేర్కొన్నాడు.
 
‘కవిత’ పేరిట సేవ్ చేసుకుని చాట్ చేసిన 2 ఫోన్ నెంబర్ల స్క్రీన్ షాట్లను సుఖేష్ విడుదల చేశాడు. అలాగే మరిన్ని వీడియో చెట్లు, ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయన్న సుఖేష్ త్వరలోనే విడుదల చేస్తానని చెప్పాడు.
`కవితక్క నేను ఎవరో తెలియదని చెప్పారు.. కానీ కవితక్క అలా చెబుతారని అనుకోలేదు. కవిత అంటే నాకు గౌరవం.. అందుకే నేను ఆమె పేరును కవితక్క అని సేవ్ చేసుకున్నా. కవితక్కకు చెందిన రెండు ఫోన్ నెంబర్లు 91‌- 6209999999, 91-8985699999 నా ఫోన్‌లో కవితక్క అని సేవ్ చేసుకున్నా అని సుకేష్ లేఖలో రాసుకొచ్చాడు.
 
ఇక తెలుగుభాషను సుఖేష్ ఎలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతల ప్రశ్నకు సుఖేష్ సమాధానం ఇచ్చాడు. తెలుగు (తండ్రి), తమిళం (అమ్మ) రెండూ మాతృభాషలే అని సుఖేష్ స్పష్టత ఇచ్చాడు. ఇంకా అనేక భాషలు మాట్లాడగలనని పేర్కొంటూ తనను ఎవరో రాజకీయంగా ప్రభావితం చేస్తారన్న విమర్శలను కొట్టిపడేశాడు.
 
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అందుకే తాను నిర్దోషిగా బయటపడాలని అనుకుంటున్నట్లు లేఖలో తెలిపాడు తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలనే ఈ వాస్తవాలను బయటపెడుతున్నట్లు చెప్పాడు. `మీరు కూడా సీబీఐ, ఈడీ విచారణకు సహకరించాలని’ కవితకు సూచించాడు.