జపాన్​ ప్రధాని సభలో పేలుడు

జపాన్ ప్రధాని ​ ఫుమియో కిషిదాకు తృటిలో ప్రాణాపాయం తప్పింది! ఆయన పాల్గొన్న ఓ సభలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి గాయాలవ్వలేదు. పేలుడు శబ్దం వినిపించిన వెంటనే అధికారులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
 
జపాన్​ దిగువ సభలోని ఓ సీటుకు త్వరలోనే ఎన్నిక జరగనుంది. ఈ సీటు జపాన్​కు పశ్చిమ ప్రాంతంలోని వకయామాలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున అక్కడ ప్రచారం చేసేందుకు శనివారం వెళ్లారు కిషిదా. సభలో ఆయన ప్రసంగించాల్సి ఉండగా, కొద్ది సేపటి తర్వాత ఓవైపు నుంచి ఓ స్మోక్​ బాంబ్​ కిషిదావైపు వచ్చింది.
 
 అనంతరం ఆ ప్రాంతంలో పొగ అలుముకుంది. కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదని స్థానిక మీడియా పేర్కొంది.

వకయామాలోని ఘటనాస్థలంలో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్​ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. కిషిదా ప్రసంగాన్ని రద్దు చేశారు.

ఈ ఘటనపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిందితుడు ఎవరు? ప్రధానిని ఎందుకు టార్గెట్​ చేశాడు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తిరిగి మరో ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని కిషిదా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

“ఇందాక నేను ప్రసంగించాల్సిన సభలో భారీ శబ్ధం వినిపించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆందోళనకు గురైన ప్రజలకు నా క్షమాపణలు. ఎవరు భయపడకండి. ఇక మనం ఎన్నికలపై దృష్టిసారిద్దాము. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. దేశానికి కీలకమైన ఎన్నిక త్వరలోనే జరగబోతోంది. మనం అందరం కలిసిగట్టుగా పనిచేయాలి,” అని మరో సభలో కిషిదా వ్యాఖ్యానించినట్టు జపాన్​కు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది.

జపాన్​లో కీలక నేతలు, అధికారులపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా అక్కడి భద్రతా వ్యవస్థలో లోపాలు ఆందోళనకరంగా మారాయి. జపాన్​ మాజీ ప్రధాని షింజో అబే  గతేడాది జులైలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ సభలో పాల్గొన్న అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది..