
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు తృటిలో ప్రాణాపాయం తప్పింది! ఆయన పాల్గొన్న ఓ సభలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి గాయాలవ్వలేదు. పేలుడు శబ్దం వినిపించిన వెంటనే అధికారులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
జపాన్ దిగువ సభలోని ఓ సీటుకు త్వరలోనే ఎన్నిక జరగనుంది. ఈ సీటు జపాన్‌కు పశ్చిమ ప్రాంతంలోని వకయామాలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున అక్కడ ప్రచారం చేసేందుకు శనివారం వెళ్లారు కిషిదా. సభలో ఆయన ప్రసంగించాల్సి ఉండగా, కొద్ది సేపటి తర్వాత ఓవైపు నుంచి ఓ స్మోక్ బాంబ్ కిషిదావైపు వచ్చింది.
అనంతరం ఆ ప్రాంతంలో పొగ అలుముకుంది. కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదని స్థానిక మీడియా పేర్కొంది.
వకయామాలోని ఘటనాస్థలంలో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. కిషిదా ప్రసంగాన్ని రద్దు చేశారు.
ఈ ఘటనపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిందితుడు ఎవరు? ప్రధానిని ఎందుకు టార్గెట్ చేశాడు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తిరిగి మరో ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని కిషిదా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
“ఇందాక నేను ప్రసంగించాల్సిన సభలో భారీ శబ్ధం వినిపించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆందోళనకు గురైన ప్రజలకు నా క్షమాపణలు. ఎవరు భయపడకండి. ఇక మనం ఎన్నికలపై దృష్టిసారిద్దాము. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. దేశానికి కీలకమైన ఎన్నిక త్వరలోనే జరగబోతోంది. మనం అందరం కలిసిగట్టుగా పనిచేయాలి,” అని మరో సభలో కిషిదా వ్యాఖ్యానించినట్టు జపాన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది.
జపాన్‌లో కీలక నేతలు, అధికారులపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా అక్కడి భద్రతా వ్యవస్థలో లోపాలు ఆందోళనకరంగా మారాయి. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గతేడాది జులైలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ సభలో పాల్గొన్న అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది..
More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’