ఆసియా దేశాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు

ఆసియా దేశాల్లోనే కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే,  ఆసియా దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బిబికి చెందినవి కావడంతో తీవ్రమైన అనారోగ్యానికి గురిచేసే రకం కాదు. తాజాగా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో ఇప్పటికే టీకాలు వేశారు. అయితే పరిస్థితులకనుగుణంగా కరోనా నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కొత్త వేవ్‌లను చవిచూడాల్సి ఉంటుందని ప్రభుత్వాలు అంచనాకొచ్చాయి.
 
సింగపూర్‌లో మార్చి చివరి వారంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవే ఈ సంవత్సరంలో అత్యధికంగా నమోదైనట్లు సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. సింగపూర్‌ ప్రజలు మాస్క్‌ ధరించకపోవడం వల్ల ఆ దేశంలో కరోనా కేసులు జరిగినట్లు భావిస్తున్నారు.
 
ఇక్కడ మార్చి చివరి నాటికి 28 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి ఏప్రిల్‌ మొదటివారంలో 14,467 కేసులు నమోదయ్యాయి. ఇక భారత్‌లో కూడా ఒక్కరోజు వ్యవధిలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు గతేడాది చివరి నాటికి చేరాయి.
 
భారత్‌లో కరోనా ఫస్ట్‌ వేవ్‌ ప్రారంభ సమయంలో 2021లో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతలతో ప్రజలు తీవ్ర సమస్యలనెదుర్కొన్నారు.
అయితే తాజాగా నమోదువుతున్న కరోనా కేసుల వల్ల ఆసుపత్రిల్లో చేరికలు లేనప్పటికీ ప్రజలు సమస్యలు ఎదుర్కోకుండా కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
 
దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష కూడా నిర్వహిస్తోంది. కరోనావ్యాప్తి రీత్యా కొన్ని రాష్ట్రాలు మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. ఇండోనేషియాలో రోజువారీ కేసులు నాలుగు నెలల గరిష్టానికి చేరాయి. రోజువారీగా వందల కేసులు నమోదవుతున్నాయి.  బుధవారంరోజు అక్కడ 987 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో రెండవ బూస్టర్‌ డోస్‌ని తీసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
 
వియత్నాం ప్రభుత్వం కరోనా వ్యాప్తి రీత్యా అక్కడి ప్రభుత్వం కరోనా నియంత్రణా చర్యలను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా చిన్నారులకు కరోనా లక్షణాలను గుర్తించడానికి పాఠశాల గేటు వద్దే వారిని పర్యవేక్షిస్తుంది. వియత్నాంలో గత వారంలో 639 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో అక్కడ సుమారు నాలుగు రెట్లు కేసులు పెరిగినట్లు వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిలిప్పిన్స్‌లో కూడా కరోనా కేసులు వేలల్లోనే నమోదవుతున్నాయి. ఇక మార్చిలో కరోనా వల్ల ఒకరు మృతి చెందారు.