కర్ణాటకలో పక్షం రోజులలో రూ 140 కోట్లు స్వాధీనం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దయెత్తున డబ్బు సంచులు హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మార్చి 29 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు, అంటే 15 రోజుల్లోనే రూ.140 కోట్ల విలువైన మొత్తాన్ని ఎన్నికల కమిషన్‌ స్వాధీనం చేసుకుంది. ఇందులో నగదు, మద్యం, డ్రగ్స్‌, వస్తువులు ఉన్నాయి.

ఎన్నికల తేదీ ప్రకటించక ముందు అంటే మార్చి 9 నుంచి మార్చి 29 వరకూ ఎన్నికల కమిషన్‌ రూ.58 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని 81 నియోజవర్గాల్లో ఎన్నికల వ్యయం అధికంగా జరుగుతుందని ఎన్నికల కమిషన్‌ గుర్తించింది.

2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే సమయానికి స్వాధీనం చేసుకున్న మొత్తం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ప్రస్తుతం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. 2018లో ఇదే కాలానికి రూ.34.13 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత ఎన్నికల్లో మొత్తంగా సుమారు రూ.185.74 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

 ప్రస్తుత ఎన్నికల్లో తాయిలాలు ఎక్కువగా పంపణీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర అదనపు చీఫ్‌ ఎలక్టొరల్‌ అధికారి వెంకటేశ్‌ కుమార్‌ తెలిపారు. శివమొగ్గ, బెంగళూరు నియోజవర్గాల్లో అత్యధికంగా తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  శివమొగ్గలో రూ.4.5 కోట్ల విలువైన బహుమతులను, బెంగళూరులోని బ్యతరయనపురలో రూ. 3.6 కోట్ల విలువైన బహుమతులను స్వాధీనం చేసుకున్నటు ఆయన తెలిపారు.

ఇంత పెద్ద మొత్తంలో నగదును పట్టుకోవడంలో పౌరుల పాత్ర కూడా ఉందని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. సి విజిల్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 2,389 ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఇందులో 1,979 ఫిర్యాదులు వాస్తవమని గుర్తించి, చర్యలు తీసుకున్నామన్నారు.

మరోవంక, కర్ణాటకలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభయింది. అసెంబ్లీ ఎన్నికలకు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభయింది. గురువారం కొంత మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 20 వరకూ గడవు ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకూ అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న ఎన్నికలు జరగున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.