యూపీలో ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ కొడుకు హతం

యూపీలో ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ కొడుకు హతం
గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ఆతిఖ్ అహ్మద్ కుమారుడు, న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అసద్ ను, అతడి అనుచరుడు గులామ్ ను గురువారం ఝాన్సీలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎస్ టీ ఎఫ్ పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు.  2005 లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన రాజు పాల్ గ్యాంగ్ స్టర్ ఆతిఖ్ అహ్మద్ సోదరుడిపై ఘన విజయం సాధించాడు.
ఆ తరువాత, ఎమ్మెల్యే గా ఉన్న రాజు పాల్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆతిఖ్ అహ్మద్ ఉన్నాడు.  ఈ కేసులో ప్రధాన సాక్షిగా లాయర్ ఉమేశ్ పాల్ ఉన్నాడు. దాంతో, తమకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వవద్దని గతంలో ఆతిఖ్ అహ్మద్, ఆయన కుమారుడు అసద్, ఇతర అనుచరులు ఉమేశ్ పాల్ ను పలుమార్లు హెచ్చరించారు. ఒకసారి కిడ్నాప్ చేసి, కొట్టి వదిలేశారు.

ఆ తరువాత, ఈ సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీన ప్రయాగ్ రాజ్ లోని తన ఇంటి ముందే ఉమేశ్ పాల్ హత్యకు గురయ్యాడు. ఉమేశ్ తో పాటు ఆయన ఇద్దరు గన్ మెన్లను కూడా చంపేశారు. ఈ ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఉమేశ్ పాల్ హత్యలో ప్రధాన నిందితుడైన అసద్ కోసం గాలింపును ముమ్మరం చేసింది. అసద్ పై, గులామ్ పై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో గురువారం ఝాన్సీలో అసద్ ఆచూకీపై విశ్వసనీయ సమాచారం రావడంతో యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో అసద్, గులామ్ హతమయ్యారు. వారి వద్ద నుంచి అత్యాధునిక విదేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఈ ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో గ్యాంగ్ స్టర్, అసద్ తండ్రి ఆతిఖ్ అహ్మద్ రాజు పాల్ హత్య కేసు విచారణలో భాగంగా కోర్టులో ఉన్నాడు. కొడుకు ఎన్ కౌంటర్ లో చనిపోయిన విషయం తెలియగానే ఆయన కోర్టు హాళ్లోనే కుప్పకూలిపోయాడు. ఇదే కేసులో ఆతిఖ్ అహ్మదాబాద్ లోని సబర్మతి జైళ్లో, ఆతిఖ్ సోదరుడు ఖాలిద్ ఆజిమ్ బరేలీ జైళ్లో శిక్ష అనుభవిస్తున్నారు.