ఐదేళ్లు శిక్షార్హ‌మైన కేసు ఉన్నా ఎన్నిక‌ల‌లో పోటీకి అనర్హత

నేరమయ రాజకీయాలను నిరుత్సాహ పరచేందుకు భారత ఎన్నికల కమీషన్ కీలకమైన సూచన చేసింది.  2016లో ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణలను ప్రస్తావిస్తూ, నేర అభియోగాలు మోపబడిన వ్యక్తులకు కనీసం ఐదేళ్ల జైలు శిక్షపడే సందర్భాలలో వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని గుర్తు చేసింది.
 
ఎన్నికలకు కనీసం ఆరు మాసాలు ముందు అభియోగాలు నమోదైన వారిని, పోటీ చేయకుండా నిషేధించాలని సూచించామని సుప్రీంకోర్టుకు ఈసీ వివరించింది. అత్యాచారం, హత్య కిడ్నాప్‌, దోపిడీ, లంచ గొండి, మనీలాండరింగ్‌, ఆదాయానికి మించిన ఆస్తులు మొద లైన తీవ్రమైన నేరాలలో అభియోగాలు మోపబడిన వ్యక్తులను ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధిం చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.
 
ఈ పిటిషన్‌పై ప్రతిస్పందన దాఖలు చేయాలని జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ఇందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. 1998 నుంచి నేరపూరిత రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ వస్తున్నామని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
 
”వాస్తవానికి, భారత ఎన్నికల కమీషన్ జూలై 15, 1998న రాజకీయాలను నేరరహతం చేయాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపింది. జూలై 2004, డిసెంబర్‌ 2016 నాటి ప్రతిపాదిత సంస్కరణలలో ఈ సిఫార్సులు పునరుద్ఘాటించాము” అని ఈసీ పేర్కొంది. రాజకీయాల్లో రాన్రాను క్రిమినల్‌ కేసులు ప్రకటిస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిల్‌పై పోల్‌ ప్యానెల్‌ ప్రతిస్పందన వచ్చింది.
 
17వ లోక్‌సభలో గెలిచిన 539 మందిలో 233 మంది (43 శాతం)పై క్రిమినల్‌ కేసులున్నాయని, 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత 185 (34 శాతం) మంది విజేతలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారేనని పిటిషనర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఈ పిటిషన్‌పై తన సమాధానం దాఖలు చేయడానికి సుప్రీం కోర్టు కేంద్రానికి తుది అవకాశం ఇచ్చింది.
 
సామాన్యులు దోపిడీకి గురవుతున్నందున ఇది చాలా ముఖ్యమైన అంశమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పోటీదారులకు అటువంటి పరిమితిని విధించడానికి, ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్‌ కేటాయింపు) ఆర్డర్‌ 1968ని సవరించడానికి, ఆర్టికల్‌ 324 కింద అందించబడిన ప్లీనరీ అధికారాన్ని ఉపయోగించుకునేలా పోల్‌ ప్యానెల్‌కు దిశానిర్దేశం చేయాలని కూడా ఈ అభ్యర్ధన కోరింది.
 
లా కమిషన్‌ తన 244వ నివేదికలో, నామినేషన్ల పరిశీలనకు కనీసం ఒక సంవత్సరం ముందు అభియోగాలు మోపబడిన, నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను డిబార్‌ చేయడానికి మొగ్గుచూపింది.