సంజయ్ ఫోనులో మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

గత వారం టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో పోయిన తన మొబైల్ ఫోనులో  బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది తనకు ఫోను చేసిన వివరాలున్నాయని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఆ విషయం తెలిసి సీఎం కేసీఆర్ మూర్చపోయి ఉంటారని అంటూ ఎద్దేవా చేశారు.
 
బీజేపీ లీగల్ విభాగం నేతలతో ఆదివారం సమావేశమైనప్పుడు తన  ఫోన్ బయటకు వస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయనే భయంతోనే కేసీఆర్ ఆ ఫోనును తన దగ్గరే పెట్టుకున్నట్లున్నారని ఆరోపించారు. ఇతరుల ఫోన్ల సంభాషణ వినడమే ఆయన పని అంటూ ధ్వజమెత్తారు.  వాస్తవానికి కరీంనగర్ లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుండి సిద్దిపేట వెళ్లే వరకు తన చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తరువాత పోలీసులే మాయం చేశారని సంజయ్ ఆరోపించారు.  ఈ విషయాన్ని దాచి పెట్టి తనను ఫోన్ అడగడం సిగ్గు చేటని మండిపడ్డారు.

కాగా, కనిపించక పోయిన తన మొబైల్ ఫోన్ గురించి ఆన్‌లైన్ ద్వారా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు సంజయ్ ఆదివారం ఫిర్యాదు చేశారు.  తన ఫోన్ కనబడటం లేదని, అరెస్ట్ చేసే క్రమంలో పడిపోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్‌లో కీలక సమాచారం ఉందని వెల్లడించారు. తన ఫోన్‌ను వెతికిపెట్టాలని పోలీసులను కోరారు.

పోలీసుల వద్దే తన ఫోన్ ఉందని స్పష్టం చేస్తూ  జైలు నుంచి విడుదల అయిన తర్వాత తన ఫోన్‌తో పోలీసులకు ఏం పని? అంటూ సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల దగ్గరే తన ఫోన్ ఉందని స్పష్టం చేస్తూ పోలీసుల మీదే తనకు అనుమానం ఉందని తెలిపారు. పైగా, తాను ఫోన్ అప్పచెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని అంటూ పోలీసులు కోర్టులలో ఫిర్యాదు చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీఎస్పీఎస్సీ లీకేజీపై న్యాయమూర్తులకు బిజెపి లేఖలు

టీఎస్పీఎస్సీ లీకేజీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీని ఆదేశించారు.  అట్లాగే ‘‘చిన్న పొరపాటు లేకుండా కేంద్రం లక్షలాది ఉద్యోగాలను క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మరి కేసీఆర్ ఫ్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోంది. ఇదే అంశాన్ని విస్త్రంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టాలి’’ అని కోరారు.

లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దీంతోపాటు పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా ఉద్యమిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో తెలిపారు.  త్వరలోనే వివిధ కోచింగ్ సెంటర్లతోపాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల్లోనూ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

కాగా,డాక్టర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ సభ్యులతో  సంజయ్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే అంశంపై కార్యాచరణను వెంటనే రూపొందించాలని ఆదేశించారు.   అందులో భాగంగా వారం రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది మందితో ‘‘నిరుద్యోగ మార్చ్’’ నిర్వహించాలని నిర్ణయించినందుకు వెంటనే ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇతర ఉమ్మడి జిల్లాల్లోనూ  నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్‘‘ తేదీలను కూడా రెండ్రోజుల్లో ఖరారు చేయాలని చెప్పారు.