
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. పగటిపూట పనుల మీద బయటికి వచ్చిన జనం వేసవి తాపానికి తాళలేక విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు ఉక్కపోత కూడా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
కాగా, రాబోయే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్13 వరకు కూడా దేశంలోని చాలా ప్రాంతాలలో కూడా 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో అక్కడక్కడా ఉరుములు, బలమైన గాలులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత ఇవే రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ఉంటుందని పేర్కొంది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని వాయువ్య రాష్ట్రాలు, ద్వీపకల్ప ప్రాంతాలు మినహాయించి, మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.
బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో హీట్‌వేవ్ ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 38 నుంచి -40 డిగ్రీల సెల్సియెస్గా నమోదవుతోంది.
వాయువ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 13 నుంచి 19 వరకు హీట్‌వేవ్ కండీషన్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని స్పష్టం చేసింది. అయితే మధ్య భారతంలో మాత్రం ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయని పేర్కొంది.
హీట్‌వేవ్ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. జూన్ వరకు పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని పేర్కొంది. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ్లల్లో బయటకు రావొద్దని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు