బోనీ కపూర్‌ కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు స్వాధీనం

కర్ణాటకలో మరో నెలలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద భారీ నిఘాను ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు, వస్తువులు పంచుతున్నారన్న ఆరోపణలతో వాహనాలను తనిఖీ చేస్తూ భద్రతను ఇంకా పటిష్టం చేస్తున్నారు.

ఈ సందర్భంలోనే దావంగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన రూ. 39 లక్షల విలువైన 66 కిలోల వెండి వస్తువులను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్వాధీనం చేసుకుంది. ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి ముంబయి తరలిస్తున్న ఈ వస్తువులకు సరైన పత్రాలు చూపించలేదు.

దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటన ఏప్రిల్ 7న తెల్లవారుజామున జరిగింది.

ఈ కేసులో డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ అయినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత కారులో ప్రయాణించిన హరిసింగ్ ను విచారించగా తరలిస్తున్న వెండి వస్తువులు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి చెందినవని అంగీకరించారు.

ఈ ఘటనలో సంబంధిత పత్రాలు సమర్పించని వెండి వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెండి వస్తువులు నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి చెందినవా, లేదంటే ఆ వ్యక్తి కావాలనే అలా చెప్పాడా అన్న దానిపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.