చందాకొచ్చర్‌ దంపతులపై సీబీఐ చార్జిషీట్‌

రూ. 3,250 కోట్ల రుణ మోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండి, సిఇఓ చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌లపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 409 నేరపూరిత విశ్వాస ఉల్లంఘనతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని ఇతర నిబంధనల కింద వీరిపై సిబిఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది.
ఈ వ్యవహారంలో మొత్తం కంపెనీలు, వ్యక్తులతో సహా 9 మందిని కుట్రదారులుగా సిబిఐ అధికారులు తెలిపారు.  ఈ క్రమంలో చందా కొచ్చర్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే సీబీఐ తన తుది నివేదికను ముంబైలోని ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు.
దీనికోసం ఐసీఐసీఐ నుంచి తగిన అనుమతులు కోరుతూ లేఖ పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, కొచ్చర్‌ దంపతులను, వేణుగోపాల్‌ ధూత్‌లను సిబిఐ గతేడాది డిసెంబర్‌లో అరెస్టు చేసింది. వీరి రిమాండడ్‌ కోసం సిబిఐ చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, కొచర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది అమిత్‌ దేశారు 2021 జూలైలో సీబీఐకి ఐసీఐసీఐ బ్యాంక్‌ రాసిన లేఖను కోర్టు దష్టికి తీసుకువచ్చారు. ప్రశ్నార్థకమైన ఏ లావాదేవీలోనూ తమకు తప్పుడు నష్టం జరగలేదని పేర్కొంది.
 
ఈ క్రమంలో బాంబే హైకోర్టు జనవరి 9న దంపతులకు బెయిల్‌ మంజూరు చేసింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌, ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంక్‌ క్రెడిట్‌ పాలసీని ఉల్లంఘిస్తూ ధూత్‌ ప్రమోట్‌ చేసిన వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.3,250 కోట్ల మేరకు రుణాలను మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది.
 
క్విడ్‌ ప్రోకోలో భాగంగా ధూత్‌ సుప్రీమ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఇపిఎల్‌) ద్వారా కొచ్చర్‌ భర్తకు చెందిన నూపవర్‌ రెన్యూవబుల్స్‌లో రూ.64 కోట్ల పెట్టుబడి పెట్టారు. సర్క్యూట్‌ మార్గంలో దీపక్‌ కొచ్చర్‌ నిర్వహించే పినాకిల్‌ ఎనర్జీ ట్రస్ట్‌కు ఎస్‌ఇపిఎల్‌ని బదిలీ చేశారు.