కరొనపై ఏప్రిల్ 10, 11 తేదీల్లో అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్

కరొనపై ఏప్రిల్ 10, 11 తేదీల్లో అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న  క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో రాష్ట్రాల్లోని అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే ఏప్రిల్ 8, 9 తేదీలలో  జిల్లా ఉన్నతాధికారులు, వైద్యాధికారులతో  కరోనా సంసిద్ధతపై సమీక్షించాలని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులను కోరింది.

రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో  కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లోని కరోనా  వ్యాప్తిపై మన్సుఖ్ మాండవియా ఆరా తీశారు. కరోనా టెస్టులతో పాటు, జీనోమ్ సీక్వెన్సింగ్‌ గురించి ప్రస్తావించారు. ప్రజలు ఆందోళన చెందకూడదని, అప్రమత్తంగా ఉండి కరొనను అడ్డుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. ప్రికాషనరీ డోసులు పంపిణీ చేయాలని తెలంగాణ  ఆరోగ్య మంత్రి హరీష్ రావు కోరగా, రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. 

ఇన్‌ఫ్లుఎంజా -వంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, అత్యవసర హాట్‌స్పాట్‌లను గుర్తించాలని మన్సుఖ్ మాండవియా సూచించారు. కరోనా  పరీక్షలు, టీకాలను వేగవంతం చేయాలని చెప్పారు. కరోనా నివారణ, నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. 

కరోనా కొత్త వేరియంట్ XBB.1.5, ఇతర ఆరు  వేరియంట్‌లను (BQ.1, BA.2.75, CH.1.1, XBB, XBF, XBB) నిశితంగా ట్రాక్ చేస్తున్నామని తెలిపారు. ఓమిక్రాన్ తో పాటు..దాని అనుబంధ కేసుల వ్యాప్తి తక్కువగా ఉన్నాయని చెప్పారు. అయితే XBB.1.16 ప్రాబల్యం ఫిబ్రవరిలో 21.6 శాతం నుండి మార్చి, 2023లో 35.8 శాతానికి పెరిగిందని చెప్పారు.

కానీ వీటి వల్ల ఆసుపత్రిలో చేరడం లేదా మరణాల సంఖ్య పెరిగినట్లు నివేదికలు అందలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కరోనా నిర్థారణ పరీక్షలను పెంచాలని సూచించారు.  మార్చి 17న  571 కేసులు నమోదైతే, ఏప్రిల్ 7తో ముగిసే సరికి సగటు రోజువారీ కేసుల సంఖ్య 4,188కి పెరిగిందని పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 88,503 రోజువారీ సగటు కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత వారంలో గ్లోబల్ కేసులు మొదటి ఐదు దేశాల్లో  62.6 శాతంగా ఉన్నాయని  తెలిపారు.కరోనాను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ పంపినీ, జాగ్రత్తలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రజలందరికీ..ముఖ్యంగా వృద్ధులకు  టీకాలు వేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు.

దేశంలో 10 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల్లో 10 శాతానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కర్ణాటక, కేరళలో ఐదు జిల్లాల్లో 5 శాతానికి పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది. మహారాష్ట్ర (3,987 యాక్టివ్‌ కేసులు), గుజరాత్‌ (2,142), ఢిల్లీ (2,060), హిమాచల్‌ ప్రదేశ్‌ (1,933), కర్ణాటక (1,516), తమిళనాడు (1,366), హర్యానా (1,132) యాక్టివ్‌ కేసులపరంగా వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి.