కరోనా – గుండెపోటు సంబంధంపై కేంద్రం పరిశోధన

కరోనా – గుండెపోటు సంబంధంపై కేంద్రం పరిశోధన

యువకులు, ఆరోగ్యవంతులలో కూడా పెరుగుతున్న గుండెపోటు నివేదికలపై విస్తృతమైన ఆందోళనలను ప్రస్తావిస్తూ దీనికి కోవిడ్‌తో ఏదైనా సంబంధం ఉందా? అనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ‘యువకులలో ఇటీవలి గుండెపోటుకు, కరోనాకు మధ్య సంబంధాన్ని కనుగొనడానికి ప్రభుత్వం పరిశోధనను ప్రారంభించింది. ఫలితాలు రెండు-మూడు నెలల్లో వస్తాయని ఆశిస్తున్నాం’ అని వివరించారు.

భారత వైద్య పరిశోధన మండలి (ఇసిఎంఆర్) గత మూడు-నాలుగు నెలలుగా గుండెపోటు, కరోనా మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తోందని, మరో రెండు నెలల్లో పూర్తయి ఫలితాలు వెల్లడించనుందని తెలిపారు. ‘‘చాలా మంది యువ కళాకారులు, అథ్లెట్లు, క్రీడాకారులు ప్రదర్శన చేస్తుండగానే వేదికలపైనే కుప్పకూలిపోవడం మనం చూస్తున్నాం. మనమందరం దానిని చూశాం. అనేక ప్రాంతాల నుంచి నివేదికలు వస్తున్నాయి. దీనిపై అన్వేషణ జరగాల్సిన అవసరం ఉంది’’ అని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

కరోనా వైరస్ జన్యుమార్పిడి ఇంకా కొనసాగుతోందని, ఇప్పటి వరకూ దేశంలో 214 వివిధ వేరియంట్లను గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  తెలిపారు. కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా సహా ఇతర క్రిటికల్ కేర్ ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి చెప్పారు.

అలాగే, వారం వారీ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. అంతేకాదు, కరోనా ఎలా ప్రవర్తిస్తుందో ఊహించడం అసాధ్యం, కానీ ఇప్పుడు ఇన్‌ఫెక్షన్ వ్యాప్తికి కారణమైన సబ్-వేరియంట్లు విపత్తును కలిగించేంత ప్రమాదకరమైనవి కావని ఆయన భరోసా ఇచ్చారు.

నాలుగో వేవ్‌కు అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఎఫ్.7, ప్రస్తుతం XBB1.16 ఉపవర్గం కారణంగా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. కానీ, ఉప వర్గాల అంతగా ప్రమాదకరం కాదనేది గత అనుభవం ద్వారా తెలుస్తోందని చెప్పారు.

‘ఏదైనా కొత్త వేరియంట్ గుర్తిస్తే దానిని ల్యాబ్‌లో ఐసోలేట్ చేస్తున్నాం. వాటిపై టీకాల సామర్ధ్యాన్ని పరిశీలిస్తున్నాం. ఇప్పటి వరకూ మన వద్ద అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ప్రస్తుతం వేరియంట్లపై సమర్ధవంతంగానే పనిచేస్తున్నాయి’ అని మాండవీయ వివరించారు. టీకా సమాచారాన్ని అందజేయడంలో CoWIN చాలా బాగా సహాయపడిందని మాండవియా చెప్పారు.