చైనాలో ప్రేమించుకునేందుకు వారం రోజుల సెలవు!

చైనాలో ప్రేమించుకునేందుకు వారం రోజుల సెలవు!
చైనాలో సుదీర్ఘకాలం `ఒక కుటుంభం – ఒకే సంతానం’ విధానం అమలు పరచడంతో జనాభా పెరుగుదల మందగించి, వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య తగ్గుముఖం పట్టింది. దానితో ఆ విధానాన్ని సడలించిన జనాభా పెరుగుదల సాధ్యం కాక, అభివృద్ధికి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది.
అందుకనే జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం కోసం పలు విధానాలకు రూపకల్పన చేస్తుండగా, అక్కడి విద్యాసంస్థలో అనూహ్యమైన ఒక విధానాన్ని  అమలు చేయడం ప్రారంభించాయి.
 
విద్యాసంస్థలలో సాధారణంగా యువత పరస్పరం ఆకర్షణతో చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుంటారో అని అధ్యాపకులు ఆవేదన చెందుతూ ఉంటారు. ఆడ- మగ విద్యార్థులు కలిసి తిరగడాన్ని నిరుత్సాహ పరుస్తుంటారు. కానీ కేవలం ప్రేమలో పడేందుకు లేదా తమ ప్రేమికులను కలుసుకునేందుకు ప్రత్యేకంగా సెలవలు ఇవ్వడం ఇప్పుడు ప్రారంభించాయి.
 
బహుశా ప్రపంచంలోనే మొదటిసారిగా తొమ్మిది వృత్తివిద్యా కళాశాలలు ఈ విధమైన సెలవులు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుండి వారం రోజుల పాటు సెలవులు ఇచ్చాయి. ‘ప్రకృతిని ప్రేమించడం, జీవితాన్ని ప్రేమించడం, వసంత విరామాన్ని ఆస్వాదించడం ద్వారా ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి’ అంటూ మరీ ప్రోత్సాహిస్తున్నాయి.
 
2019 నుండి వేసవిలో వారం రోజుల పాటు సెలవులు ఇస్తున్నప్పటికీ, ఈ సారి ప్రత్యేకంగా “ప్రకృతిని ఆనందించి, ప్రేమలో పడేందుకు” అంటూ ఇచ్చారు. వ్యక్తిత్వ వికాసంతో పాటు శృగారంలో మునిగితేలేందుకు అని చెబుతున్నారు. పైగా, హోమ్ వర్క్ గా రోజువారీ కార్యక్రమాలు, వ్యక్తిత్వ అభివృద్ధి సంబంధ అంశాలతో డైరీలు వ్రాయమని, వీడియోలు తీయమని కూడా పురమాయిస్తున్నారు.
చైనాలో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండేది. కానీ 2022 తర్వాత ఆ దేశ జనాభా గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే ఆరు దశాబ్దాల కనిష్ఠానికి ఆ దేశ జనాభా తగ్గిపోయింది. ఇప్పుడు చైనా జననాల రేటును పెంచుకోడానికి పలురకాల చర్యలు చేపడుతోంది.

ఒకప్పుడు ఒక కుటుంబానికి ఒకే సంతానం అన్న నిబంధన విధించిన ఆ దేశం నేడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. దంపతులు మూడో బిడ్డను కంటే రూ. 2 లక్షలను హాంగ్జౌ అనే చైనా నగరం ఇస్తోంది. రెండో బిడ్డను కంటే రూ. 60000 ఇస్తోంది. షెన్‌యాంగ్ అనే మరో చైనా నగరమైతే నెల బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకు నెలకు రూ. 6000 వరకు సబ్సిడీని అందిస్తోంది.

తగ్గిపోతున్న వివాహాల సంఖ్యను ప్రోత్సహించడం కోసం కొన్ని కంపెనీలు 30 రోజుల “వివాహ సెలవులు” ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఉండే వివాహం కానీ వృద్ధులను ప్రేమించమని నగరాలలోని యువతులను మరికొన్ని కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి.