పోలవరం నిర్మాణ బాధ్యతలు కేంద్రమే తీసుకోవాలి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, నిర్వాసితులకు పునరావాసం అమలుపైనా దృష్టి పెట్టడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వినతి పత్రం సమర్పిస్తూ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి కేంద్ర మంత్రి షెకావత్ ను కలిసిన పవన్ కళ్యాణ్  రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక ప్రయోజనాలు అందిస్తుందని గుర్తు చేశారు.

 ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ తింటోందని షెకావత్ దృష్టికి తీసుకువెళ్లారు. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

విశాఖ పారిశ్రామిక జోన్ కు అవసరమైన నీటినీ, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవడంపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని షెకావత్‌కు తెలిపారు.

పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్. అండ్ ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన శ్రద్ధ చూపడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు, మిగిలిన 24 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ మూలంగా విశాఖపట్నం, గోదావరి జిల్లాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలతో పాటు గోదావరి డెల్టాలోనే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు అందించడంతోపాటు ఈ నిర్మాణంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ తక్షణ జోక్యం అవసరమని ఆయన సూచించారు.