వచ్చే నాలుగేళ్లలో యుపిలో ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ

వచ్చే నాలుగేళ్లలో యుపిలో ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ
ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులేస్తోంది. యూపీలో రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నసందర్భంగా భారీ ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించిన యోగీ సర్కార్ ఇప్పుడు వాటిని అందిపుచ్చుకుని ఆర్ధిక వ్యవస్ధను పరుగులు తీయించేందుకు సిద్ధమవుతోంది.
 
ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో ఆర్ధిక వ్యవస్ధను ట్రిలియన్ స్ధాయికి (రూ.82 లక్షల కోట్లు)కు తీసుకెళ్లేందుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రణాళికలను సిద్ధం చేశారు. వచ్చే నాలుగేళ్లలో ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్ధను సాధించే లక్ష్యంతో 10 కీలక రంగాలపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయించారు.
 
ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి కీలకమైన ఈ పది రంగాల్లో శాంతిభద్రతలు, వ్యవసాయాభివృద్ధి, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ, పట్టణాభివృద్ధి, విద్య, వైద్యం, పర్యాటకం, రెవెన్యూ ఉన్నాయి. తాజాగా పెట్టుబడుల సదస్సులో రూ.35 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.6.9 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.

 
వచ్చే నాలుగేళ్లలో ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చేలా పది రంగాలు పుంజుకునేలా ప్రతీ రంగానికీ ఓ అదనపు కార్యదర్శి స్ధాయి అధికారుల్ని యోగీ నియమించారు. ఈ పది రంగాల అభివృద్ధి కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేయాలని యోగీ ఆదేశాలు ఇచ్చారు. కరోనా కారణంగా గత మూడేళ్లూ ప్రపంచవ్యాప్తంగా, అలాగే దేశంలోనూ ఆర్ధిక వ్యవస్ధలన్ని కుదేలయ్యాయని, కానీ యూపీ మాత్రం 16.8 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుందని యోగీ సర్కార్ చెబుతోంది. అలాగే జాతీయోత్పత్తిలో 8 శాతం యూపీ నుంచే ఇస్తున్నట్లు కూడా చెబుతోంది.