మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేసు

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి తిరిగి వెడుతుంటే ఉద్దండరాయపాలెం గ్రామం వద్ద తమ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై వైసిపి కార్యకర్తలు దాడి చేశారని బిజెపి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవలసింది పోయి, ముందుగానే వెళ్లిపోవడంతో ఆ దాడిలో వైసీపీ శ్రేణుల నుండి తప్పించుకున్నారని భావిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నేత ఆదినారాయణరెడ్డిపై పోలీసులు ఎదురు కేసు నమోదు చేశారు.
 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆదినారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదును స్వీకరించి ఆదినారాయణరెడ్డిపై కేసు పెట్టామని గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ పులిపాటి ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.
 
తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేత సత్యకుమార్‌ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరేసి, ఆ తర్వాత పొలాల్లోకి పారిపోయాడని తెలిపారు  ఈ క్రమంలోనే తమపై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారంటూ మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారు ఫిర్యాదు చేశారని ఎస్పీ ప్రవీణ్ తెలిపారు.
 
దీంతో ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మందడం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. అమరావతి ఉద్యమం 1,200 రోజులకు చేరుకున్న నేపథ్యంలో రైతులకు బీజేపీ నేత సత్యకుమార్‌ మద్దతు తెలిపి, తిరిగి వెళ్తున్న సమయంలో మూడు రాజధానుల శిబిరం వద్ద కొందరు అడ్డుకున్నారు.
 
వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనివ్వగా సత్యకుమార్‌ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.