హైదరాబాద్ లో ఏ మూల నుంచైనా రూ 15కే రైలు ప్రయాణం

హైదరాబాద్ లో ఏ మూల నుంచైనా రూ 15కే రైలు ప్రయాణం

హైదరాబాద్ లో మేడ్చల్ వరకు పొడిగిస్తూ రెండోదశ ఎంఎంటీఎస్ సర్వీస్‌ పనులు పూర్తయ్యాయి. ఈ పనులను 2014లోనే మొదలుపెట్టగా ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. త్వరలోనే కూతపెట్టేందుకు రంగం సిద్ధమైంది.  ఈ సేవలను ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రెండో దశలో భాగంగా మేడ్చల్‌- సికింద్రాబాద్‌- ఉందానగర్‌, మేడ్చల్‌- సికింద్రాబాద్‌ -తెల్లాపూర్‌ మార్గంలో ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు.

దానితో నగరంలోని ఏ మూల నుంచైనా మేడ్చల్‌‌కు వెళ్లడం సులువు కానుంది. ఎంఎంటీఎస్‌ ఎక్కితే కేవలం 10 నుంచి 15 రూపాయలతోనే 40 నుంచి 55 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. మేడ్చల్‌- ఉందానగర్‌ మధ్య దూరం 55 కిలోమీటర్లు కాగా, ప్రయాణికులు గరిష్ఠంగా 15 రూపాయలతోనే ప్రయాణం చేయవచ్చు.

 మేడ్చల్‌ నుంచి లింగంపల్లికి 52 కిలోమీటర్లు కాగా, ప్రయాణానికి రెండు నుంచి మూడు గంటలు పట్టేది. అయితే, అందుబాటులోకి వస్తున్న రెండోదశ వల్ కేవలం గంటలోనే గమ్యస్థానాలను చేరుకునే అవకాశముంది. మేడ్చల్‌- తెల్లాపూర్‌తో పాటు మేడ్చల్‌- ఉందానగర్‌ మధ్య సికింద్రాబాద్‌ మీదుగా ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

హైదరాబాద్‌ నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మేడ్చల్‌ నుంచి ఉందానగర్‌, తెల్లాపూర్‌ వరకు ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరిస్తున్నట్టు వివరిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాలకు మెట్రో రైలు ద్వారా వేగంగా వెళ్తున్నా శివారు ప్రాంతాలకు ఆ సౌకర్యం లేకపోయింది. ప్రధానంగా మేడ్చల్ ప్రాంతానికి వెళ్లాలంటే ఇప్పటివరకు బస్సు సౌకర్యం తప్ప మిగతా ఎలాంటి సౌకర్యం లేదు.