
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కాన్వాయ్ పై ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో శుక్రవారం దాడి జరిగింది. సత్యకుమార్ అనుచరుడిపై పిడిగుద్దులు గుద్దారు. పధకం ప్రకారమే తనపై దాడి చేశారని సత్యకుమార్ ఆరోపించారు. తన కారును పోలీసులే ఆపారని, ఎందుకు ఆపారని అడిగే లోపే తన వాహనంపై వైసీపీ గూండాలు దాడి చేశారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడిపై డీఎస్పీ సమాధానం చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. జగన్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఏపీలో వైసీపీ అరాచకానికి అడ్టుకట్ట వేస్తామని హెచ్చరించారు. మందడం గ్రామంలో మూడు రాజధానులకు మద్దతుగా కొంత మంది శిబిరం నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 1200 రోజులవుతున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలిపేందుకు సత్యకుమార్ వచ్చారు. ఆ తర్వాత తుళ్లూరులో పార్టీ నేత ఒకరిని పరామర్శించడానికి వెళ్లారు.
ఆయన తుళ్లూరు నుంచి మందడంలోని మూడు రాజధానుల మద్దతు శిబిరం మీదుగా వెళ్తారన్న సమాచారం ముందుగానే తెలియడంతో కొంత మంది ముందుగానే ఆయనను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సత్యకుమార్ కాన్వాయ్ మందడం దగ్గరకు రాగానే కొంత మంది అడ్డుకున్నారు. మరికొంత మంది రాళ్లతో దాడి చేశారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ప్రమాదాన్ని గుర్తించిన సత్యకుమార్ డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపైనా దాడి చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ వాహనాన్నే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం వెనుక వ్యూహం ఉందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు.
ఇటీవలి కాలలో బీజేపీ అమరావతికి పూర్తి స్థాయిలో ప్రకటిస్తోంది. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న సత్యకుమార్ కూడా అమరావతికి మద్దతుగా రైతులకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు. ఇాలాంటి సమయంలో ఆయనపై దాడి చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులు సంచలనం సృష్టించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై దాడిని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పలికేందుకు వచ్చిన సత్యకుమార్ కారుపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. కారుపై దాడిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు? అని ప్రశ్నించారు. పక్కా ప్రణాళికతోనే వైసీపీ గూండాలు దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు