హర్ష్‌ మందర్‌ ఎన్‌జిఓపై సిబిఐ విచారణ

హర్ష్‌ మందర్‌ ఎన్‌జిఓపై సిబిఐ విచారణ
ప్రముఖ రచయిత, కాలమిస్ట్‌, మాజీ ఐఏఎస్ అధికారి హర్ష్‌ మందర్‌ నడుపుతున్న ఎన్‌జిఓపై కేంద్రం మంగళవారం సిబిఐ విచారణకు ఆదేశించింది. హర్ష మందర్‌కు చెందిన ఎన్‌జిఓ ‘అమన్‌ బిరాదారి’ విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్రం ఆరోపించింది.  విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద రిజిస్టర్‌ చేయకుండా అమన్‌ బిరాదారి సంస్థ విదేశీ సంస్థలైన ఆక్స్‌ఫామ్‌, యాక్షన్‌ ఎయిడ్‌ నుండి రూ. 2 కోట్ల విలువైన విరాళాలను పొందినట్లు కేంద్రం ఆరోపించింది.
2002 గుజరాత్‌ మారణహోమం అనంతరం స్థాపించిన ఈ సంస్థ నరేంద్ర మోదీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. మందర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ‘సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌’ సంస్థ మత మార్పిడి వంటి అక్రమ కార్యకలాపాల కోసం భారీగా నిధులు సేకరిస్తోందని కేంద్రం ఆరోపించింది. గతంలో మనీలాండరింగ్‌ ఆరోపణల కింద హర్ష ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారణను కూడా ఎదుర్కొన్నారు.
 
2021 సెప్టెంబర్‌లో ఈడి ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలోని ఆయన నివాసం, కార్యాలయంతోపాటు అమన్‌ బిరాదారీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమీద్‌ అనే చైల్డ్‌ కేర్‌ సంస్థపై కూడా దాడులు చేపట్టింది.  యుపిఎ హయాంలో రాజ్యాంగేతర వేదికగా పేరొందిన సోనియా గాంధీ నేతృత్వంలోని వివాదాస్పద జాతీయ సలహా మండలిలో హర్ష మందిర్ క్రియాశీలకంగా పనిచేశారు.
 
హర్ష్ మందర్ దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో పనిచేశారు.  2002లో గుజరాత్‌లో జరిగిన  ‘ప్రభుత్వ  ప్రాయోజిత అల్లర్లకు’ నిరసనగా సర్వీసును విడిచిపెట్టారు. కొంతకాలం ఏక్షన్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ గా పనిచేశారు.

మార్చి 2020లో, మందర్ భారత ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ముస్లిం గుంపులను రెచ్చగొట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదానికి గురయ్యాడు. ప్రభుత్వంకు సంబంధించిన నిర్ణయాలను సుప్రీం కోర్టు లేదా పార్లమెంటు బట్వాడా చేయదని, వీధుల్లోనే తీసుకుంటామని మందర్ చెప్పారు.
 
ఈ సంఘటన తర్వాత, ఢిల్లీ పోలీసులు హర్ష్ మందర్‌పై అఫిడవిట్ దాఖలు చేశారు, హింసను ప్రేరేపించడమే కాకుండా న్యాయవ్యవస్థకు అప్రదిష్ట తీసుకు వచ్చారని  ఆరోపిస్తూ, అతనిపై కోర్టు ధిక్కార చర్యలను కోరింది.
 
అయోధ్యలో రామమందిర్ నిర్మాణంకు అడ్డంకులు తొలగించిన సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసిన 40 మందిలో హర్ష మందిర్ ఒకరు. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేక నిరసనలతో సహితం ముఖ్యపాత్ర వహించారు. విదేశీ నిధులు స్వీకరిస్తున్న ఎన్జీఓతో ఉంటూ ఈ కార్యక్రమాలు అన్ని చేయడం గమనార్హం.