ఏపీ అప్పులు ప్రస్తుతం రూ.5,50,650 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ప్రస్తుతం రూ.5,50,650 కోట్లుగా ఉన్నాయని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తేల్చింది. ఇందులో బహిరంగ మార్కెట్‌ రుణాలతోపాటు, కేంద్రం నుంచి తెచ్చిన రుణాలు, ఇతర సంస్థల ద్వారా వచ్చిన రుణాలు, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన గ్యారంటీ రుణాలు కూడా కలిపి ఉన్నాయి.  గ్యారంటీ రుణాలు మినహాయిస్తే మిగిలిన రుణాలు జిఎస్‌డిపిలో 33.94 శాతంగా ఉన్నట్లు లెక్క తేలింది.

2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రుణాల లెక్కలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. మొత్తం రుణాల్లో ప్రభుత్వ సెక్యూరిటీలను రిజర్వు బ్యాంకు వద్ద తనఖా పెట్టడం ద్వారా తీసుకున్న బహిరంగ మార్కెట్‌ రుణాలే రూ.2,04,033 కోట్లుగా ఉన్నట్లు తేలింది. ఈ లెక్కలు ఫిబ్రవరి 14 వరకు కాగా, ప్రస్తుతం మరింత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలు రూ.20,962 కోట్లు, ఇతర సంస్థల నుంచి పథకాల అమలు కోసం తీసుకున్న రుణాలు రూ.18,079 కోట్లు, చిన్న మొత్తాల పొదపు నుంచి తీసుకున్నవి రూ.8227 కోట్లు, ప్రావిడెండ్‌ ఫండ్‌ నుంచి తీసుకున్న రుణాలు రూ.29,236 కోట్లు, డిపాజిట్లు ద్వారా సేకరించిన రుణాలు రూ.51,719 కోట్లుగా ఉన్నట్లు తేలింది.

2014 నుంచి జిఎస్‌డిపిలో రుణాల శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014-15లో 28.25 శాతంగా ఉన్న రుణం తరువాత కొంత తగ్గుముఖం పట్టగా, 2019-20 నుంచి పెరగడం ప్రారంభించింది. ఆ సంవత్సరం 31.02 శాతానికి చేరుకున్న రుణం మరుసటి ఏడాది 35.53 శాతానికి చేరుకుంది. 2021-22లో 31.46 శాతానికి ఉన్న రుణం, ఈ ఏడాది ఫిబ్రవరికి 33.94 శాతానికి చేరుకుంది.

పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే గ్యారంటీల ద్వారా వచ్చిన రుణాలు కూడా ప్రస్తుతం రూ.1,18,394 కోట్లుగా ఉన్నాయి. ఈ రుణాల్లో పౌర సరఫరాల సంస్థవే రూ.31 వేల కోట్లకుపైగా ఉండడం గమనార్హం.  పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా మరో రూ.18,115 కోట్లు రుణంగా తీసుకున్నారు. కేవలం రుణాల కోసమే ఏర్పాటుచేసిన ఎపి రాష్ట్రాభివృద్ధి సంస్థ తీసుకున్నవి రూ.22,504 కోట్లు ఉండడం విశేషం. ఇవి కాకుండా నబార్డు ద్వారా వివిధ పథకాలకు మరో రూ.8,367 కోట్లు రుణంగా తీసుకున్నారు.