
మహిళా దినోత్సవ వేడుకలకు సరిగ్గా ఒక్కరోజు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఓ మహిళకు యుద్ధక్షేత్రాన భారత వైమానిక దళం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఫ్లైట్ కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి మహిళగా నిలిచిన ‘షాలిజా ధామి’నే అందుకు ఎంపిక చేసింది.
పశ్చిమ విభాగంలో గ్రూప్ కెప్టెన్ గా ఉన్న షాలిజ ధామిని మిస్సైల్ స్క్వాడ్రన్ కు ఇన్ చార్జిగా నియమించారు. ఇలా కీలకమైన ఒక కంబాట్ యూనిట్ బాధ్యతలను స్వీకరించనున్న తొలి మహిళగా గ్రూప్ కెప్టెన్ షాలిజ ధామి రికార్డు సృష్టించారు. మహిళలకు యుద్ధ రంగ బాధ్యతలను కూడా అప్పగించాలన్న సాయుధ దళాల విధాన నిర్ణయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫ్రంట్‌లైన్ కాంబాట్ యూనిట్‌కు మహిళా అధికారి నాయకత్వం వహించడం వైమానిక దళ చరిత్రలో ఇదే తొలిసారి. ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా వాయుసేనలో అడుగుపెట్టారు. దాదాపు 2900 ఫ్లైయింగ్ హవర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.
షాలిజ ధామి తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లైయింగ్ ఇన్ స్ట్రక్టర్, అలాగే వెస్ట్రన్ సెక్టర్ లో హెలికాప్టర్ యూనిట్ కు ఫ్లైట్ కమాండర్ గా వ్యవహరించిన తొలి మహిళ కూడా. వాయుసేనలో గ్రూప్ కెప్టెన్ అంటే ఆర్మీలో కల్నల్ హోదాతో సమానం. ప్రస్తుతం ఆమె ఫ్రంట్‌లైన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
కీలక బాధ్యతలను, యుద్ధ రంగంలో ముందుండి పోరాడగల బాధ్యతలను, పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులకు ఇవ్వకూడదన్న భావన నుంచి సాయుధ దళాలు బయటకు వస్తున్నాయనడానికి షాలిజ ధామి నియామకమే ఉదాహరణ అని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. ‘‘ప్రస్తుతం సాయుధ దళాల్లోని మహిళా అధికారులు యుద్ధ విమానాలను నడుపుతున్నారు. యుద్ధ నౌకలపై కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పర్సనల్ బిలో ఆఫీసర్ కేడర్ లోకి వెళ్తున్నారు. పర్మినెంట్ కమిషన్ కు అర్హత సాధిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు’’ అని వివరించారు.
ఆర్మీ, నేవీ కూడా తమ స్పెషల్ ఫోర్సెస్ లోకి మహిళా అధికారులను తీసుకుంటున్నాయి. ఆర్మీకి చెందిన గరుడ కమాండోలో, నేవీకి చెందిన మెరైన్ కమాండోస్ లో ఇప్పుడు మహిళా అధికారులు ఉన్నారు. రెండు నెలల క్రితం ఆర్మీ హిమాలయాల్లో అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన సియాచిన్ గ్లేసియర్ యూనిట్ లోకి తొలిసారి ఓ మహిళా అధికారిని పంపించింది. ఆ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా కెప్టెన్ శివ చౌహాన్ నిలిచారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం