భూకంప బాధితులకు 3 లక్షల డాలర్లు సేకరించిన ఇండో-అమెరికన్లు

తుర్కియే, సిరియాలో  పెను భూకంపం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి ఆకాశ హార్మ్యాలు పేకమేడలా కుప్పకూలాయి. దీంతో వేలాది మంది మరణించారు. లక్షల్లో జనాభా నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకోవడానికి అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన అమెరికన్లు ముందుకువచ్చారు.
 
అగ్రరాజ్యంలోని భారతీయులంతా కలిసి 3 లక్షల అమెరికన్‌ డాలర్లకుపైగా (రూ.2.45 కోట్లు) నిధులను సేకరించారు. ఇందులో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ హేమంత్ పటేల్ నేతృత్వంలో అనేకమంది భారతీయ అమెరికన్లు కలిసి 2.30 లక్షల అమెరికన్‌ డాలర్లను జమచేశారు.

ఈ నిధులను న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో తుర్కియే రాయబారి మురాత్ మెర్కాన్, న్యూయార్క్‌లోని తుర్కియే కాన్సుల్ జనరల్ రెహాన్ ఓజ్‌గర్‌కు అందించారు. ఈ సందర్భంగా భూకంపం బారినపడిన ప్రజలకు మద్దతుగా నిలిచినందుకుగాను భారతీయ అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే తుర్కియే, సిరియా భూకంప బాధితుల సహాయార్థం హూస్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సేవా ఇంటర్నేషనల్‌ అమెరికార్ప్స్‌ డొనేషన్‌ డ్రైవ్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా హూస్టన్‌లోని వివిధ కమ్యూనిటీలకు చెందినవారు ఆహారం, బట్టలు, స్వెట్టర్లు, హైజీన్‌ వస్తువులు, టెంట్లు, హీటర్లు, షూస్‌, చిన్నారులకు సంబంధించిన వందలకొద్ది వస్తువులను సేకరించి బాధిత దేశాలకు పంపించారు.