ప్రీతీది ఆత్మహత్య కాదు హత్య… సోదరుడు స్పష్టం

నిమ్స్ లో చికిత్స పొందుతూ నిమ్స్ లో మృతి చెందిన కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని డా. ప్రీతీ మృతిపై ఇంకా అనుమానాలు వెంటాడుతున్నాయి. కళాశాల వారు, డాక్టర్లు, పోలీసులు చెబుతున్నట్లు ఆమెది ఆత్మహత్యకాదని, హత్య మాత్రమే అని ఆమె కుటుంభం సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆమె సోదరుడు పృథ్వి స్పష్టం చేస్తున్నారు.
 
ఇక తాజాగా తన సోదరి ప్రీతికి, సైఫ్ కు కౌన్సిలింగ్ ఇచ్చామని అధికారులు చెప్పిందంతా పూర్తి అబద్ధమని తోసిపుచ్చారు.  హెచ్ ఓ డి తన సోదరి ప్రీతిని పిలిచి, ఎటువంటి వివరణ అడగకుండా బాగా తిట్టాడని ఆరోపించారు. ఆమెను తీవ్రమైన వేధింపులకు గురిచేసి, మరణానికి కారణమైన సైఫ్ కు పూర్తి మద్దతుగా ఉన్న నాగార్జున రెడ్డితో కమిటీని ఏర్పాటు చేయడం ఏమిటని అతను ప్రశ్నించారు.
 
సైఫ్ కు అనుకూలంగా కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు నిమ్స్ లో ప్రీతి పొత్తికడుపు వద్ద సర్జరీ చేశారని పేర్కొంటూ ఆ సర్జరీ ఎందుకు చేశారో కూడా ఇప్పటివరకు తెలియలేదని ఆమె సోదరుడు విస్మయం వ్యక్తం చేశారు. ప్రీతికి చేతి పై గాయం ఉందని కూడా తెలిపాడు.
 
 ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలసిస్ చేశారని పేర్కొన్న అతను పోస్టుమార్టంలో ప్రీతి బాడీలో ఉన్న ఇంజక్షన్ గురించి ఎలా తెలుస్తుంది? అంటూ ప్రశ్నించారు. నిమ్స్ లో జరిగిన చికిత్సపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.  నిమ్స్ వైద్యులు తమ సోదరికి చేసిన పూర్తి వైద్య చికిత్స వివరాలను తమకు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ర్యాగింగ్ కమిటీ పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. నాగార్జున రెడ్డి తప్పు చేసిన వ్యక్తి అయితే, అతడిని ఎలా ర్యాగింగ్ కమిటీలో ఉంచుతారని ప్రశ్నించారు. నాగార్జున రెడ్డి కమిటీ రిపోర్టును మార్చి ఉంటారని ప్రీతి సోదరుడు పృధ్వి సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి సెల్ ఫోన్ లో మెసేజ్ లను తను చెక్ చేసానని పేర్కొన్న పృధ్వీ తమకు కనిపించని మెసేజ్ లు పోలీసులకు ఎలా కనిపించాయి అంటూ ప్రశ్నించారు.