ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ కీలక నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని, నిబంధలకు విరుద్దంగా టెండర్ల అప్పగించారని ఆయనపై ముందు నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ ఇవాళ మరోసారి విచారించింది.
 
దాదాపు 8 గంటల విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని, అందులో మనీశ్ సిసోడియా హస్తముందని సీబీఐ వెల్లడించింది.
 
సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. అటు లిక్కర్‌ పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారు. అయితే ఈ  స్కామ్‌కి సంబంధించి బ్యూరోక్రాట్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా సిసోడియాను అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
 
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ.. బుచ్చిబాబు,గౌతమ్ మల్హోత్రా సహా  పలువురిని అరెస్ట్ చేసింది.   ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆదివారం విచారణకు హాజరువాలంటూ సీబీఐ నోటీసులివ్వడంతో అరెస్ట్ ఖాయమని మనీష్ సిసోడియా ముందే ఊహించారు. విచారణకు హాజరయ్యేముందే ఆదివారం పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
ఆదివారం ఉదయం తన నివాసం నుంచి బయల్దేరిన సిసోడియా రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు కూడా నిర్వహించారు. కాగా వారం క్రితమే సిసోడియాను సీబీఐ విచారణకు పిలిచింది. కానీ ఢిల్లీ బడ్జెట్ రూపకల్పనలో తాను తీరిక లేకుండా గడుపుతున్నానని, తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఆదివారం ఉదయం 11 గంటల్లోగా హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది.