కాకతీయ పీజీ వైద్య విద్యార్ధిని పరిస్థితి అత్యంత విషమం 

కాకతీయ పీజీ వైద్య విద్యార్ధిని పరిస్థితి అత్యంత విషమం 
వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా వైద్య విద్యార్ధిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. సీనియర్ విద్యార్ధి వేధింపులు తట్టుకోలేక మంగళవారం రాత్రి హాస్టల్లో గుర్తు తెలియని పదార్ధాన్ని ఇంజక్షన్ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయింది. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ కావడంతో ఆమెను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతిని గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్  పరామర్శించారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని చెబుతూ వైద్యానికి సహకరించి ప్రీతి త్వరగా కోలుకుని తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కేసులో చాలా పరిణామాలు జరిగాయని.. ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఈ కేసులో విచారణ పూర్తి స్థాయిలో జరగాలని ఆమె  పోలీసులను కోరారు.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ)లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు.
ఆత్మహత్యాయత్నానికి ముందే తండ్రితో ఫోన్‌‌లో మాట్లాడటంతో కుమార్తె మానసిక స్థితిపై ఆయన అనుమానించారు. హైదరాబాద్‌లో రైల్వే పోలీస్ ఎస్సై‌గా పనిచేస్తున్న నరేందర్ సహచర విద్యార్ధుల్ని అప్రమత్తం చేశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న వైద్యురాలిని ఎంజిఎం ఆస్పత్రిలో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు.
 

ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. పీజీ అనస్తీషియా చదువుతున్న ప్రీతి మూడు నెలలుగా ఎంజిఎంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు సీనియర్‌గా ఉన్న సైఫ్‌ అనే విద్యార్ధి తీవ్రంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడుతోంది.

 
కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో వైద్య విద్యార్ధిని పరీక్షల్లో ఫెయిల్ చేస్తారని ఆందోళనకు గురైంది. ఇటీవల ఆమె సోదరి వివాహం జరగడంతో ఐదు రోజులు సెలవుపై హైదరాబాద్ వెళ్లింది. ఆమెకు మూడు రోజులు మాత్రమే సెలవు మంజూరు చేసి రెండ్రోజులు అబ్సెంట్ వేసినట్లు తండ్రికి చెప్పుకుని బాధపడింది.
 
కాలేజీకి వచ్చి తాను మాట్లాడుతానని ప్రీతి తండ్రి నచ్చ చెప్పినా వద్దని వారించినట్లు వాపోయాడు. ఆ తర్వాత సీనియర్ల వేధింపులు తీవ్రం కావడంతో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినట్లు సహ విద్యార్ధులు చెబుతున్నారు. ఆమె ఫిర్యాదుతో కేఎంసీ ప్రిన్సిపల్ సీనియర్లను మందలించినట్లు తెలుస్తోంది.
 
ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సీనియర్‌ పీజీ విద్యార్థిని కఠినంగా శిక్షించాలని తండ్రి డిమాండ్‌ చేశారు. కాగా,  సైఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు.
 
ఎబివిపి ఆందోళన
 
ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ముందు భైఠాయించిన ఏబీవీపీ నాయకులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొంత కాలంగా సీనియర్ విద్యార్థి వేధిస్తున్నాడని ప్రీతి కళాశాల అధికారులకు ఫిర్యాదు చేసినా,  చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ఆరోపించారు.
 
మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీనియర్ విద్యార్థి డిగ్రీ రద్దు చేసి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.