అమృత్‌పాల్ మద్దతుదార్ల పోలీస్ స్టేషన్ పై దాడి.. బీభ‌త్సం

వివాదాస్పద మత గురువు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ ఖలీస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరుడు లవ్‌ప్రీత్‌ తుఫాన్‌ను ఓ కేసులో అమృత్‌స‌ర్ పోలీసులు అరెస్టు చేయడంతో రెచ్చిపోయిన వందలాది మంది అమృత్‌పాల్‌ అనుచరులు పోలీసులపైకి దండెత్తి వచ్చారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగిస్తూ వీరంగం సృష్టించారు.

వెంటనే లవ్‌ప్రీత్‌ను విడుదల చేయాలని, ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని డిమాండ్‌ చేశారు. అమృత్‌పాల్‌ సింగ్‌ కూడా పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. గంటలో ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయకపోతే తర్వాత జరిగే పరిణామాలకు యంత్రాంగమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమృత్‌సర్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు.

అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు కత్తులు, ఆయుధాలు పట్టుకుని గురువారం పోలీసులతో ఘర్షణకు దిగి పెను బీభ‌త్సం సృష్టించారు. అమృత్‌సర్ జిల్లాలోని పోలీస్ కాంప్లెక్స్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. నిరసనల మధ్య ఆరుగురు పోలీసులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. అమృత్‌పాల్ సింగ్ స‌న్నిహితుడు ల‌వ్‌ప్రీత్ తూఫాన్‌ను పోలీస్ స్టేషన్ నుండి విడిపించుకున్నారు.
 
ఇదిలావుండగా ఉద్రిక్తతను తగ్గించడానికి, పరిస్థితి సున్నితంగా ఉండడంతో ‘లవ్‌ప్రీత్ తుఫాన్ నిర్దోషి, నిరసనకారులు తగిన రుజువు చేశారు’ అని పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ మీడియాతో పేర్కొన్నవలసి వచ్చింది.  ‘సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) దీనిని గమనించింది. వీరు శాంతియుతంగా చెదరగొట్టబడతారు. చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది’ అని తెలిపారు. రోపర్ జిల్లాలోని చమ్‌కౌర్ సాహిబ్ నివాసిని కిడ్నాప్ చేసి కొట్టినందుకు అమృత్‌పాల్ సింగ్, ఆయన మద్దతుదారులపై కేసు నమోదయింది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకారుల గుంపును చూపించాయి. అయితే పోలీసులు జనాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు.‘కేవలం రాజకీయ ఉద్దేశ్యంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గంటలో కేసును రద్దు చేయకపోతే, తదుపరి ఏమి జరిగినా దానికి అడ్మిన్‌స్ట్రేషన్ బాధ్యత వహిస్తుంది’ అని హెచ్చరించాడు.

‘వారిస్ పంజాబ్ దే’ అనేది గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త దీప్ సిద్దూ స్థాపించిన ర్యాడికల్స్ సంస్థ. జ‌ర్నేల్ సింగ్ బింద్ర‌న్‌వాలా స్ఫూర్తిగా అమృత‌పాల్ సిక్కుల‌ను త‌న బోధ‌న‌ల‌తో రెచ్చ‌గొడుతున్నారు. బింద్ర‌న్‌వాలా త‌ర‌హాలో అమృత్‌పాల్ సింగ్ డ్రెస్ చేసుకొంటూ, ట‌ర్బ‌న్ కూడా క‌ట్టుకుంటూ ప్రత్యేక సిఖ్ దేశం కోసం పోరాడుతున్నాడు.

ఖలిస్తానీ ఉద్య‌మాన్ని అణిచివేస్తామ‌ని హెచ్చరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇటీవల అమృత్ బెదిరించారు. ఇందిరా గాంధీ త‌ర‌హాలోనే చంపేస్తామ‌ని హెచ్చరించాడు. పాకిస్థాన్ ఐఎస్ఐతో అమృత్‌పాల్ సింగ్‌కు ఏదైనా లింకు ఉందా అన్న కోణంలో భద్రతాదళాలు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.