ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే  వర్గానిదే అసలు శివసేన పార్టీ అని, ‘విల్లు, బాణం’ గుర్తు కూడా షిండే వర్గానిదేనని ఎన్నికల కమిషన్ ప్రకటించిన నిర్ణయంను సవాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.  ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం కోర్టును కోరింది.
 
మరోవైపు ఈసీ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు శిండే వర్గానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా జవాబివ్వాలని ఆదేశించింది. మరో వారం రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఉద్ధవ్ వర్గం ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే పార్టీ పేరును, కాగడా గుర్తును కూడా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
 
ఈ విషయంలో ఏదో నిర్ణయం తీసుకునే వరకు యధాస్థితిని కొనసాగించాలని ఉద్ధవ్‌ వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. తమకు రక్షణ కావాలని, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకోవడం ఇష్టం లేదని పేర్కొన్నారు. శివసేన పార్లమెంటరీ కార్యాలయాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.
 
కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించింది. అంతేకాదు 1966లో శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ కూడా శిందే వర్గానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాలు విడుదల చేసింది.
 
గత ఏడాది జూన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ(ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా షిండే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ తర్వాత.. ఉద్ధవ్‌, శిండే వర్గాల మధ్య శివసేన పేరు, పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే పేరును వాడుకోవడం, పార్టీ గుర్తు విషయంలో ఆదిపత్య పోరు మొదలైంది.
 
ఆర్నెల్ల క్రితం తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని, పార్టీ గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరుతూ ఉద్ధవ్‌ ఠాక్రే ఈసీఐకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ ఏర్పాటైంది. ఉద్ధవ్‌, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తుది ఆదేశాలను జారీ చేసింది.
 
శిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆర్నెల్ల క్రితం కమిషన్‌ ఏర్పాటవ్వగానే శివసేన పార్టీ పేరు, గుర్తును ఈసీఐ ఫ్రీజ్‌ చేసింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి శివసేన(ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) పార్టీ పేరును, వెలుగుతున్న కాగడాను ఎన్నికల గుర్తుగా కేటాయించింది. శిందే వర్గానికి ‘బాలాసాహెబ్‌ అంచి శివసేన’ పేరును, రెండు కత్తులతో ఉన్న డాలు గుర్తును కేటాయించింది.
 
శుక్రవారం నాటి ఆదేశాల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి ఈ నెల 27న జరగనున్న ఉప ఎన్నికల వరకు ఆర్నెల్ల క్రితం కేటాయించిన పార్టీ పేరు, గుర్తులు కొనసాగుతాయని త్రిసభ్య కమిషన్‌ స్పష్టం చేసింది. షిండే వర్గానికి కేటాయించిన పార్టీ పేరు, గుర్తు తక్షణం రద్దవుతాయని, ఇకపై శివసేన పేరును, విల్లు-బాణం గుర్తును ఉపయోగించుకోవొచ్చని పేర్కొంది.
 
‘‘ఉద్ధవ్‌ వర్గం ఈ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు 2018 నాటి పార్టీ రాజ్యాంగ సవరణను ఉటంకించింది. 1999 నాటి శివసేన పార్టీ రాజ్యాంగమే ఈసీఐ రికార్డుల్లో ఉంది. అందుకే.. ఉద్ధవ్‌ వర్గం లేవనెత్తుతున్న 2018 పార్టీ రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోలేం’’ అని కమిషన్‌ తన ఆదేశాల్లో తేల్చిచెప్పింది.  ఈసీఐ నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్వాగతించగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయం ప్రజాస్వామ్యం పాలిట ప్రమాదకరమని  పేర్కొంటూ ఉద్ధవ్‌  సుప్రీంకోర్టులో సవాలు చేశారు.