వైమానిక ప్రదర్శనకు వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు!

బెంగళూరు యెలహంకలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద జరుగుతున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనను తిలకించేందుకు వేలసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ‘ఏరో ఇండియా 2023’ అనే ఎయిర్ షోను చివరి రెండు రోజులు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించడంతో విశేషంగా ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.వెయ్యి, రూ.2,500 టికెట్లు బుక్‌ చేసుకున్నవారిని తనిఖీల అనంతరం లోపలికి అనుమతించారు. తమ సెల్‌ఫోన్లతో ఆకాశంలో రయ్ మంటూ దూసుకుపోయే విమాన దృశ్యాలను రికార్డు చేశారు. కొందరు శబ్దాన్ని తట్టుకోలేక చెవులు మూసుకున్నారు.

ఈ వైమానికి ప్రదర్శనలో రాఫెల్, జాగ్వర్ డరిన్, అపాచే ఏహెచ్64, ఎంబ్రేర్ సి390 మిల్లినియం వంటి విమానాలను ప్రదర్శించారు. ఈ ఎయిర్ షోలో ఏరియల్ డిస్‌ప్లే వ్యూయింగ్ ఏరియా(ఏడివిఏ) నుంచి చూసేందుకు రూ. 1000 టిక్కెట్ పెట్టారు. ఎగ్జిబిషన్ ఏరియా అండ్ ఏడివిఏ ఏరియా నుంచి చూసేందుకైతే రూ. 2500 టిక్కెట్ ధర పెట్టారు. పెద్ద ఎత్తున జనం రావడంతో ఈ టిక్కెట్ ధరలు పెట్టారని వినికిడి.

ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీ కార్పొరేషన్‌ల ప్రోత్సాహంతో సుమారు 2,500మంది విద్యార్థులకు ఎయిర్‌షో తిలకించే అవకాశం కల్పించారు. రక్షణా రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక పరిణామాలను విద్యార్థులు తెలుసుకునేందుకు ఇది బాగా దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 అమెరికాకు చెందిన ఎఫ్‌ 35, మనదేశానికి చెందిన తేజస్‌, సుఖోయ్‌ యుద్ధ విమానాలు ఆకాశంలో భారీ శబ్ధాల చక్కర్లతో సందర్శకులు కేరింతలు కొట్టారు. సూర్యకిరణ్‌, సారంగ్‌ హెలికాప్టర్‌ల విన్యాసాలు వరుసగా నాల్గోరోజు కూడా హైలెట్‌గా నిలిచాయి.

బెంగళూరు యలహంక ఎయిర్‌బేస్‏లో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలో చెన్నై ఐఐటీ ప్రొఫెసర్‌ సత్య చక్రవర్తి నాయకత్వంలోని బృందం రూపొందించిన బ్యాటరీ ఆధారిత ఈ-200 బుల్లి విమానం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. కాంపాక్ట్‌ ఫ్లైయింగ్‌ ఎలక్ట్రిక్‌ ట్యాక్సీగా పిలవబడే ఈ బుల్లి విమానం 200 కేజీల బరువు ఉంటుంది.

 ఇది రెండు ఫార్చూన్‌ కార్లతో సరిసమానమైన నిడివిని కలిగి ఉంటుంది. టేకాఫ్‌, టేకాన్‌లకు పెద్దగా స్థలం అవసరం ఉండదు. ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి త్వరగా బయటపడేందుకు భవిష్యత్తులో ఇలాంటి బుల్లి విమానాలు ఎంతో ఉపకరిస్తాయని చక్రవర్తి అంటున్నారు. ఈ ట్యాక్సీలో గరిష్టంగా ఆరుగురు నుంచి పదిమందివరకు ప్రయాణించవచ్చునని, మెజస్టిక్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 15 నిమిషాలలో చేరుకోవచ్చునని పేర్కొన్నారు.

ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల పాటు ఏకధాటిగా ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. మరిన్ని పరిశోధనల అనంతరం ఈ బుల్లి విమానాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులకు అవకాశం ఉందని చెప్పారు.