తెలుగు రాష్ట్రాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న పలు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థులను ఖరారు చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుత ఎమ్యెల్సీ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవన్ ను తిరిగి ఎంపిక చేశారు.

ప్రకాశం, నెల్లూరు , చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప , అనంతపురం , కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగరూరు రాఘవేంద్రలను బరిలో దింపుతున్నట్లు బిజెపి ప్రకటించింది.  తెలంగాణాలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డి పేరు ప్రకటించింది.

ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇక ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ నిర్వహించనున్నారు.