ఉత్సాహభరితంగా విద్యాపీఠం స్వర్ణ జయంతి వేడుకలు

 
శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణ జయంతి వేడుకలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తున్న ప్రధాన అధ్యాపకులు, ఉప ప్రధాన అధ్యాపకులకు శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ శారదాధామంలోని శిక్షణ కేంద్రం ఆవరణలో మూడు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా భారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణా రావు, సంఘటన కార్యదర్శి గోవింద్ మొహంతో,
దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి విచ్చేసి మార్గదర్శనం చేశారు.
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400కు పైగా పాఠశాలలను శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్వహిస్తున్నది. విలువలు కల విద్యను అందించేందుకు 50 సంవత్సరాలుగా కృషి చేస్తున్నది. ప్రధాన అధ్యాపకుల శిబిరంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రగతిని చర్చించారు. శిశు మందిర్ పాఠశాలల నిర్వహణలో కీలక పాత్ర వహిస్తున్న ఆచార్యులతో భవిష్యత్తు ప్రణాళిక ల మీద చర్చ జరిపారు.
 
ఈ సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. తిరుపతి రావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు, క్షేత్ర శైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ మార్గనిర్దేశం చేశారు. శిబిరం సందర్భంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం అభ్యున్నతికి కృషిచేసిన సంఘటన కార్యదర్శులను సన్మానించారు.
 
 జేఎమ్ కాశీపతి, లింగం సుధాకర్ రెడ్డి, వీఆర్ జగదీష్, పతకమూరి శ్రీనివాస్, కన్నా భాస్కర్, పసర్తి మల్లయ్య తదితరులను సత్కరించారు. తెలుగు నాట విలువలతో కూడిన విద్యను, సామాజిక నైపుణ్యాలను అన్ని వర్గాల విద్యార్థులకు సేవాభావంతో శ్రీ సరస్వతీ విద్యాపీఠం అందిస్తున్నది.  ఈ నిరంతర కృషి లో జీవిత పర్యంతం సేవలు అందిస్తున్న ప్రచారక్ లను సత్కరించారు.  ఈ ప్రస్థానం లో ముఖ్య పాత్ర పోషించిన నాయకత్వ శ్రేణులు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను అభినందించారు. మూడు రోజుల శిబిరం నిర్వహణ ద్వారా సిబ్బందిలో మరింత ఉత్తేజం కల్పించారు.