ఢిల్లీ మద్యం కుంభకోణంలో మీడియా అధినేత అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నేడు ఈడీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. కొంత విరామం తరువాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును రెండో చార్జిషీట్‌లో చేర్చడంతో తిరిగి దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఇక నిన్నటికి నిన్న ఇద్దరి అరెస్ట్‌లను ప్రకటించి సంచలనం సృష్టించారు. నేడు కూడా ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేతను ఈడీ అరెస్ట్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో చారియట్ మీడియా సంస్థ అధినేత రాజేష్ జోషిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ తరపున రూ.31 కోట్ల నగదును అతడు దినేష్ అరోరాకు అందజేసినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఢిల్లీకి చెందిన రాజేష్ జోషి నగదు బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు.

 హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ అధికారులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో ముడుపులుగా అందిన డబ్బులని గోవా ఎన్నికలకు ఆప్ ఉపయోగించిందని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున డబ్బును గోవా ఎన్నికలలో ఆప్ తరఫున రాజేష్ జోషి ఖర్చు పెట్టారని ఈడీ వర్గాలు తెలిపాయి.

కాగా, బుధవారం ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు దఫాలుగా బుచ్చిబాబును విచారించిన అనంతరం మంగళవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బుధవారం అధికారికంగా ఆయన అరెస్ట్‌ను ప్రకటించారు.

ఇక నిన్ననే ఈ కేసులో మరొకరిని సైతం అధికారులు అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు అరెస్ట్‌ను ప్రకటించిన కాసేపటికే ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. మద్యం విధానంలో మార్పులకు కీలకపాత్ర వహించారని గౌతమ్ మల్హోత్రా ఆరోపణలు ఎదుర్కొన్నారు.  మద్యం విధానం రూపకల్పన సమయంలో వ్యాపార లావాదేవీలు జరపడంతో పాటు.  రాజకీయ పార్టీకి చెందిన వారితో డబ్బు లావాదేవీల్లో గౌతమ్ మల్హోత్రాకు భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.