టర్కీ, సిరియాల్లో 4,000 దాటిన మృతుల సంఖ్య

టర్కీ, సిరియాల్లో ప్రకృతి ప్రళయ తాండవం చేస్తుంది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన శక్తివంతమైన భూకంపం ధాటికి రెండు దేశాల్లో వేలాదిమంది ప్రజలు మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పలు నగరాల్లో వందలాది ఆకాశ హర్య్మాలు నేలమట్టమయ్యాయి. కుటుంబాలకు కుటుంబాలే శిధిలాల కింద చిక్కుకుపోయాయి.
 
తాజా స‌మాచారం ప్ర‌కారం మృతుల సంఖ్య 4372కు చేరుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. కేవ‌లం   టర్కీలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశ డిజాస్ట‌ర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య 15,834గా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. సిరియాలో భూకంపం వ‌ల్ల సుమారు 1451 మంది మ‌ర‌ణించారు. మ‌రో 3531 మంది గాయ‌ప‌డ్డారు.

టర్కీలో ప్ర‌భుత్వం ఏడు రోజుల సంతాప దినాల‌ను ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా మూడు భారీ భూకంపాల‌తో ఆ దేశం అత‌లాకుత‌ల‌మైన‌ట్లు అధ్య‌క్షుడు రీసెప్ త‌య్యిప్ ఎర్డ‌గోన్ తెలిపారు.  టర్కీలో సుమారు 185 సార్లు భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఖ‌ర‌మ‌న్‌మార‌స్ కేంద్రంగా భూమి కంపించిన విష‌యం తెలిసిందే. రెండో కంపం 7.7 తీవ్ర‌త‌తో, మూడ‌వ‌ది 7.6 తీవ్ర‌త‌తో సంభ‌వించిన‌ట్లు అధికారులు తెలిపారు.

టర్కీలో వ‌చ్చిన భూకంపం వ‌ల్ల గ్రీన్‌ల్యాండ్‌లో కూడా ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు డెన్మార్క్ జియోలాజిక‌ల్ స‌ర్వే పేర్కొన్న‌ది. 1999లో వ‌చ్చిన 7.4 తీవ్ర‌త భూకంపం తర్వాత ఇదే పెద్ద కంప‌మ‌ని ఇస్తాంబుల్ అధికారులు వెల్ల‌డించారు. ఆ ఏడాది వ‌చ్చిన భూకంపంలో 17వేల మంది మ‌ర‌ణించారు.

ప్ర‌స్తుతం ద‌క్షిణ  టర్కీలో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. మరోపక్క శీతాకాలం, పైగా మంచు విపరీతంగా కురుస్తుండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భూకంపం కారణంగా ఈ ప్రాంతంలోని మూడు విమానాశ్రయాలు పనికిరాకుండా పోయాయని, దాంతో కీలకమైన సహాయ పంపిణీ ఇబ్బందవుతోందని అధికారులు తెలిపారు.

భారత్‌, అమెరికా, యురోపియన్‌ యూనియన్‌, రష్యా, ఫ్రాన్స్‌, స్వీడన్‌ సహా పలు దేశాలు ఇప్పటికే తమ వంతు సాయానిు అందిస్తునుట్లు తెలిపాయి. టర్కీకి చేయగలిగిన సాయమంతా చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు