కేటీఆర్ లెక్కలు తెలుసుకొని మాట్లాడు

కేటీఆర్ లెక్కలు తెలుసుకొని మాట్లాడు
రాష్ట్రంలో రైల్వే పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మండిపడ్డారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు గతం కంటే 3 నుంచి పదింతల వేగంతో జరుగుతున్నాయని చెప్పారు. అప్పట్లో రోజుకు 4 కి.మీ. కొత్త లైన్లు వేయగా, ఇప్పుడు 12 కి.మీ. వేస్తున్నామని.. విమర్శించే ముందు గణాంకాలు చూడాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి కేటీఆర్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అశ్వినీ వైష్ణవ్ హితవు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి సరైన సహకారం అందడంలేదని విమర్శించారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి  కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూ. 886 కోట్ల రైల్వే కేటాయింపులు జరిగితే.. తెలంగాణ ఏర్పడ్డాక..రూ. 4,418 కోట్లను కేటాయించామని వెల్లడించారు. రాష్ట్రంలో రూ. 29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 39 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.

కేటీఆర్‌ చెప్పినట్లు రైల్వే ప్రైవేటీకరణ ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో, హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రైల్వే బడ్జెట్‌-మేధావుల సదస్సు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైల్వే శాఖకు ప్రధాని మోదీ కొత్త బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిపిన విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ కోసం రూ.600 కోట్లు, సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీకరణ కోసం రూ.517 కోట్లు కేటాయించామని తెలిపారు. తెలంగాణ కోసం కేంద్రం ఎంత చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని వైష్ణవ్ విమర్శించారు. రైల్వే ప్రాజెక్టుల పూర్తికిగాను ఎన్నిసార్లు లేఖలు రాసినా నామమాత్రపు స్పందన ఉంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్లకు పైగా విడుదల చేయాల్సి ఉందని, నాలుగైదేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన తెలిపారు.

తెలంగాణలో 1300 కి.మీ కొత్త రైల్వే లైన్లకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని, ఇందు కోసం భూసేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రం తనవంతు నిధులు విడుదల చేస్తూనే ఉందని చెబుతూ ఇందులో భాగంగానే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా నిధులు కేటాయించిందని రైల్వే మంత్రి చెప్పారు.

కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని, గత నెలలో టెండరు ప్రక్రియ కూడా పూర్తయిందని వివరించారు. రాష్ట్రంలో వేగన్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం రూ. 521 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకు 160 ఎకరాలు స్థలం అవసరంకాగా.. ప్రభుత్వం 150 ఎకరాలు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు.

భద్రాచలం రైల్వేస్టేషన్‌, కొత్తగూడెం-భద్రాచలం లైనుకు సంబంధించి డీపీఆర్‌ సిద్ధమవుతోందని చెప్పారు. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ సేవలను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద తెలంగాణలో 39 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తామని, మరిన్ని వందేభారత్‌ రైళ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. రానున్న మూడేళ్లలో 100 కి.మీ.లోపు ఉన్న నగరాలను కలుపుతూ వందే మెట్రో రైళ్లను నడిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

దేశంలో మాంద్యం 30 శాతానికి చేరిందని తెలంగాణ మంత్రి ఒకరు అన్నారని పేర్కొంటూ పూర్తిగా ఊహాజనితంగా చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తాయని కేంద్ర మంత్రి హెచ్చరించారు. దీనిపై స్పందించే ముందు గణాంకాలు చూడాలని అశ్వినీ వైష్ణవ్‌ సూచించారు. రైల్వే ప్రమాదాల నివారణకు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ’కవచ్‌’ వ్యవస్థను మరింత మెరుగుపర్చడానికి వ్యూహాలను రూపొందించాలని సాంకేతిక నిపుణులను రైల్వే మంత్రి ఆదేశించారు.
 
శనివారం సికింద్రాబాద్‌లోని ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌(ఐఆర్‌ఐఎ్‌సఈటీ)ను ఆయన సందర్శించారు. సాంకేతిక నిపుణులతో సమావేశమై ‘కవచ్‌’ పనితీరును సమీక్షించారు.