స్పీకర్‌ను అడ్డుపెట్టుకొని గొంతునొక్కుతున్నారు

ప్రతిపక్ష పార్టీల ఎంఎల్‌ఎలకు మాట్లాడనివ్వకుండా శాసనసభలో అధికార పక్షం గంధరగోళం సృష్టిస్తోందని బిజెపి పక్ష నాయకుడు ఈటల రాజేందర్ విమర్శించారు. స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని మా గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు.  శనివారం శాసనసభ వాయిదా అనంతరం ఈటల రాజేందర్, రఘనందన్‌రావులు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి కెటిఆర్ చెప్పిన సమాధానం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కెటిఆర్ తన వాగ్ధాటితో వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని ఈటల రాజేందర్ విమర్శించారు.

సందర్భం వచ్చినపుడు మాటలు చెప్పి కాలం గడుపుకునేవారికి ప్రజలు బుద్దిచెబుతారని హెచ్చరించారు.  24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అంతా అబద్దం చేప్పారని పేర్కొంటూ 2014 కంటే పూర్వం ఉన్న పరిస్థితే రాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలు సమయానికి ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు.

సభలో మంత్రి కెటిఆర్ వ్యక్తిగత ఆరోపణలు దిగారని, క్లారిఫికేషన్‌కు సభాపతి సమయం ఇవ్వడం లేదని రఘనందన్‌రావు విమర్శించారు. 2018 నాటి కరపత్రం తెచ్చి కెటిఆర్ మాట్లాడారని పేర్కొంటూ 2014,2019లలో మీ వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనేది తమకు కూడా వర్తిస్తుందని కెటిఆర్ గుర్తించాలని హితవు చెప్పారు. .

కాగా, అసెంబ్లీలో నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే రఘునందర్ రావు నిలదీశారు. మూడేళ్లు దాటినా..తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంటూ సభలో కేటీఆర్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు అయితున్నా ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని రఘునందన్ ఆరోపించారు. తనను గెలిపించారన్న అక్కసుతో కేసీఆర్ దుబ్బాకకు డిగ్రీ ఇవ్వలేదని, రింగ్ రోడ్డు కూడా మంజూరు చేయలేని వాపోయారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని రఘునందన్ హామీ ఇచ్చారు. 

అసెంబ్లీలో గంటలు గంటలు మాట్లాడుతున్న కేటీఆర్.. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వడం లేదని రఘునందన్ వాపోయారు. బీజేపీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారంటూ కేటీఆర్ కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. బీజేపీకి కూడా సమయం వస్తదని, అప్పుడు కేటీఆర్ కూర్చేనే ప్లేస్లో తాము ఉంటామని స్పష్టం చేశారు. అప్పుడు తాము వారిలా కాకుండా అందరికీ మాట్లాడే అవకాశమిస్తామని రఘునందన్ చెప్పారు.