
దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరిందని,రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామంగా విలసిల్లుతోందని, సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ తెలిపారు. కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించామని, రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందిందని ఆమె చెప్పారు.
సీఎం కేసీఆర్సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసైల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతుండగా, హైకోర్టు జోక్యంతో బడ్జెట్ సమావేశాలకు ఆమెను ఆహ్వానించడంతో రెండేళ్ల తర్వాత ఆమె అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నమస్కరించి గవర్నర్ తమిళిసైకి స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని ఆమె యథాతథంగా చదివారు.
‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది” అన్న కాళోజి మాటలతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు. తన ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందని చెబుతూ దేశ ధాన్యాగారంగా తెలంగాణ అవతరిస్తోందని ఆమె చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం, మంత్రుల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉందని తెలుపుతూ తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నదని గవర్నర్ వెల్లడించారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని ఆమె తెలిపారు.
పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదని ఆమె పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని ఆమె చెప్పారు.
అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదిగిందన్ని తమిళిసై కొనియాడారు. 2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం.. ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని ఆమె వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపు స్థాయిలో జరిగిందని చెబుతూ అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని ఆమె అభినందించారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి