
కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ (97) కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మంగళవారం తుది శ్వాస విడిచారు. శాంతి భూషణ్ 1977-79 నుంచి వరకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేసిన రాజ్ నారయణ్ తరపున శాంతి భూషణ్ వాదించి గెలిచారు. ఈ కేసులో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఇందిరా గాంధీ ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దానితో ఆమె ఎమర్జెన్సీ విధింపుకు దారితీశారు.
1980లో ప్రఖ్యాత ఎన్జీవో సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ సంస్థను స్థాపించారు. ఇది స్థాపించినప్పటి నుంచి అనేక ముఖ్యమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. శాంతి భూషణ్ 2009లో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నోర్ లో 1925 నంబర్ 11న జన్మించిన శాంతి భూషణ్..సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. 14 జూలై 1977 నుంచి 2 ఏప్రిల్ 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా శాంతి భూషణ్ పని చేశారు. ఇందిరాగాంధీతో విభేదాలు ఏర్పడి చీలిపోయిన కాంగ్రెస్ (ఓ) పార్టీలో సేవలందించారు.
ఆ తర్వాత జనతా పార్టీలో, 1980లో బీజేపీలో చేరారు. 1986లో ఎన్నికల పిటిషన్‌పై బీజేపీ ఆయన సలహాలను అంగీకరించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తే శాంతి భూషణ్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. శాంతి భూషణ్ ఇద్దరు కుమారులు జయంత్, ప్రశాంత్ భూషణ్ కూడా ప్రముఖ న్యాయవాదులే.
2009లో న్యాయవాది అయినా కొడుకు ప్రశాంత్ భూషణ్ అప్పటివరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న 16 మందిలో సగం మంది అవినీతిపరులే అని ఆరోపించినప్పుడు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో కొడుకు పక్షాన నిలబడి, అవే ఆరోపణలు చేస్తూ తనను జైలుకు పంపమని సవాల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు వారిని జైలుకు పంపలేదు. ఆ కేసు ఇప్పటివరకు విచారణకు రాలేదు.
శాంతిభూషణ్ పై చెలరేగిన ఓ భూసంబంధం వివాదంను త్వరితగతిన విచారించాలని, 97 ఏళ్ళ వయస్సులో వృద్ధుడైన తన తండ్రి ఎక్కువకాలం ఉండకపోవచ్చని, ఈ మధ్యనే ఆయన చిన్న కుమారుడు జయంత్ భూషణ్ కోర్టులో ప్రార్ధించారు. ఫిబ్రవరిలో ఆ కేసును చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ హామీ ఇచ్చారు. ఈ లోగానే మృతిచెందారు.
శాంతిభూషణ్ ఇకలేరనే వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. న్యాయ రంగానికి, పేదల కోసం ఆయన చేసిన కృషిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శాంతి భూషణ్ మృతికి సంతాపం తెలిపారు. బిజెపి, ఆప్ లలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ క్రియాశీలకంగా ఆయా పార్టీలలో పనిచేసిన ఆయన చివరకు వాటి నాయకత్వాలపైననే తిరుగుబాటలు చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు