
హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో గల ఆశ్రమంలో 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగి ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా సమతా కుంభ్ పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆశ్రమ నిర్వాహకులు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.
గత సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఈ సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. సమతా కుంభ్ 2023 పేరుతో ఆధ్యాత్మిక పండగను 10 రోజుల పాటు నిర్వహించబోతోన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 12వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని చినజీయర్ స్వామి చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా ఇవే తేదీల్లో బ్రహ్మోత్సవాలు జరుపుతామని తెలిపారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమే అనే స్ఫూర్తిని ప్రపంచం మొత్తానికీ చాటి చెప్పిన ఆ సమతా మూర్తి రామానుజాచర్యుల వారిని స్మరించుకుంటూ ఈ బ్రహోత్సవాలకు సమతా కుంభ్ పేరుతోనే వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని వివరించారు. ఆశ్రమానికి వచ్చే ప్రతి భక్తుడికీ తీర్థ ప్రసాదాలను అందజేస్తామని చెప్పారు.
ఫిబ్రవరి 2వ తేదీన విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు. 3వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, 4వ తేదీన సమతామూర్తికి కృతజ్ఞాంజలి కీర్తన, రామానుజ నూత్తాందిది సామూహిక పారాయణం జరుపుతారు. 5వ తేదీన రామానుజాచార్యులవారి విగ్రహానికి 108 రూపాల్లో శాంతి కల్యాణోత్సవం, 6వ తేదీన ఉదయం వసంతోత్సవం, సాయంత్రం 18 గరుడ సేవలు, 7వ తేదీన ఉదయం డోలోత్సవం, హనుమద్వాహన సేవ, 18 గరుడ సేవలను నిర్వహించనున్నారు.
8వ తేదీన కల్హరోత్సవం, సామూహిక పుష్పార్చన, సాయంత్రం 18 రూపాల్లో తెప్పోత్సవం, 9వ తేదీన రామానుజులవారికి వరివస్య, సాయంత్రం అశ్వ వాహన సేవ, 18 గరుడ సేవలు, 10వ తేదీన ఉదయం సామూహిక ఉపనయనాలు, సాయంత్రం గజవాహన సేవ, 18 గరుడ సేవలు, 11వ తేదీన ఉదయం రథోత్సవం, చక్రస్నానం, మధ్యాహ్నం విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం, 12వ రోజున ఉత్సవం అంత్యస్నపనం, సాయంత్రం మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణలను నిర్వహించనున్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి