గుజరాత్‌ పంచాయతీరాజ్‌ ఎగ్జామ్‌ పేపర్‌ హైదరాబాద్‌లో లీక్‌!

గుజరాత్‌ పంచాయతీరాజ్‌ శాఖలో జూనియర్‌ క్లర్క్‌ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించతలపెట్టిన పరీక్ష పేపర్‌ కూడా లీక్‌ కావడంతో ఆదివారం జరుగవలసిన పరీక్షలను వాయిదా వేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,995 కేంద్రాల్లో పరీక్ష మొదలు కావాల్సి ఉండగా, పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందే జామ్‌నగర్‌లో పేపర్‌ లీక్‌ అయ్యింది.
 
దాంతో ప్రభుత్వం అప్రమత్తమై రద్దు చేసింది. రాబోయే వంద రోజుల్లో నూతన ప్రశ్నపత్రాలను ముద్రించి పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షల నిర్వహణ తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. కాగా, గుజరాత్‌లో ఇవాళ జరగాల్సిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ముంద్రించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచే పేపర్‌ లీక్‌ అయ్యిందని, ఒడిశాకు చెందిన ప్రదీప్‌ నాయక్‌ ఈ పేపర్‌ లీకేజీలో కీలకపాత్ర పోషించినట్లు తేలింది.
ప్రదీప్‌ నాయక్‌ సూచన మేరకు హైదరాబాద్‌కు చెందిన జీత్‌ నాయక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి గుజరాత్‌ పరీక్ష ప్రశ్నపత్రాన్ని తస్కరించి అతనికి చేరవేసినట్లు వెల్లడైంది. దాంతో గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు హైదరాబాద్‌కు చేరుకుని జీత్‌ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో పేపర్‌ లీకేజీకి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఈ కేసుకు సంబంధించి వడోదరకు చెందిన 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్‌) తెలిపింది. ఇందులో ఐదుగురు గుజరాత్‌కు చెందిన వారు కాగా, పది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. నిందితులపై ఎటిఎస్‌ నిరంతరం నిఘా ఉంచిందని, పేపర్‌ లీక్‌ వెనుక అంతర్‌ రాష్ట్ర్ర ముఠా హస్తం ఉన్నట్లు తెలుస్తోందని ఎటిఎస్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ సునీల్‌ జోషి తెలిపారు.

మొత్తం 1181 పోస్టుల భర్తీ కోసం జరగాల్సిన జూనియర్ క్లర్క్‌ పరీక్షకు గుజరాత్‌ రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షల మంది దరఖాస్తు చేరుకున్నారు. వారిలో దాదాపు ఏడు లక్షల మందికి పైగా ఆదివారం పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. పేపర్‌ లీక్‌ అయిన జామ్‌నగర్‌లోనే దాదాపు 26 వేల పైచిలుకు అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా అర్ధాంతరంగా పరీక్ష ఆగిపోయింది.