ఒకేరోజు కుప్పకూలిన మూడు యుద్ధ విమానాలు

ఒకేరోజు కుప్పకూలిన మూడు యుద్ధ విమానాలు
భారత వాయుసేనకు చెందిన మూడు యుద్ధ విమానాలు శనివారం కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్‌ జెట్లు, రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైనట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం  రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోరు-30, మిరాజ్‌ 2000 విమానాలు మొరేనా సమీపంలో కాసేపటికే కూలిపోయాయి.
 
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి ఈ రెండు యుద్ధ విమానాలు బయల్దేరాయని, విన్యాసాలు సాగుతుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు కూలిపోయాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు రెండు ఫైటర్ జెట్ విమానాలు కూలాయని మోరీనా జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఘటన స్తలంలో విమానశకలాలు తునాతునకలైపోయినట్లుగా గుర్తించారు.పైలట్లు సకాలంలో బయటపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లుగా పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ బగ్రీ తెలిపారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. మిరేజ్ ఫైటర్ జెట్ పైలెట్ కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఐఏఎఫ్ కోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.
 
కాగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వాయుసేనకు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తొలుత అది చార్టర్ ఫ్లైట్ అని భావించినా అనంతరం అది వాయుసేనకు చెందిన యుద్ధ విమానంగా గుర్తించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు స్వల్పగాయాలయ్యాయి. వీటిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.