సోషల్ మీడియాపై ఫిర్యాదులకు ప్రత్యేక కమిటీలు

సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరకర సమాచారంపై యూజర్లు, లేక ఇతర వర్గాలు చేసిన ఫిర్యాదులపై ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నిర్ధారిత సమయంలోగా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం రూపొందించిన ఐటీ రూల్స్ లో స్పష్టంగా ఉంది. ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఏ చర్యలు తీసుకోకపోయినా, తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేకపోయినా బాధితులు ఇప్పుడు ప్రభుత్వం నియమించిన కమిటీలను ఆశ్రయించవచ్చు.
 
ఐటీ రూల్స్ లో చేసిన సవరణ మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇచ్చిన ఆదేశాలను ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఇంటర్మీడియరీలు కచ్చితంగా అమలు చేయాలని, ఒకవేళ అమలు చేయని పక్షంలో వాటికి ఐటీ రూల్స్ లోని సెక్షన్ 79 ప్రకారం లభించే ఇమ్యూనిటీని కోల్పోతాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పష్టం చేశారు.
 
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి సరైన స్పందన లభించని పక్షంలో బాధితులు 30 రోజుల్లోగా ఈ కమిటీలను ఆశ్రయించాల్సి ఉంటుంది.  తొలి కమిటీలో హోం శాఖ లోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్ పర్సన్ గా ఉంటారు.  మాజీ ఐపీఎస్ అశుతోశ్ శుక్లా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సునీల్ సోనీ సభ్యులుగా ఉంటారు. వీరి పదవీకాలం మూడేళ్లు. రెండో కమిటీకి సమచార ప్రసార శాఖలో పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు.
 
రిటైర్డ్ కామడోర్ సునీల్ కుమార్ గుప్తా, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కవింద్ర శర్మ సభ్యులుగా ఉంటారు. మూడో కమిటీకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలో సైంటిస్ట్ గా పని చేస్తున్న కవిత భాటియా చైర్ పర్సన్ గా ఉంటారు. రిటైర్డ్ ఐఆర్ టీఎస్ అధికారి సంజీవ్ గోయల్, ఐడీబీఐ ఇన్ టెక్ లిమిటెడ్ మాజీ ఎండీ కృష్ణగిరి రఘోత్తమరావు మురళీ మోహన్ సభ్యులుగా ఉంటారు.