ముంబై పార్క్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొల‌గించిన షిండే స‌ర్కార్‌

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ముంబైలోని మ‌ల‌ద్ ప్రాంతంలో గార్డెన్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. మ‌ల‌ద్‌లోని టిప్పు సుల్తాన్ గార్డెన్‌కు ఆ పేరు తొల‌గించాల‌ని ముంబై స‌బ‌ర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను సంబంధిత మంత్రి మంగ‌ళ్ ప్ర‌భాత్ లోధా ఆదేశించారు.

స‌క‌ల్ హిందూ స‌మాజ్ నిర‌స‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మ‌ల‌ద్‌లోని పార్క్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొల‌గించాల‌ని ఆదేశాలు జారీ చేశామ‌ని, ఇది రైట్ గ్రూప్ విజ‌య‌మ‌ని పేర్కొంటూ మంత్రి ట్వీట్ చేశారు. గ‌త ఎంవీఏ ప్ర‌భుత్వం ఈ గార్డెన్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్ట‌గా టిప్పు సుల్తాన్ గార్డెన్ అని కొంద‌రు బ్యాన‌ర్ క‌ట్టార‌ని మంత్రి వివ‌రించారు.

అయితే ఈ బ్యాన‌ర్‌పై స్ధానికులు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశార‌ని, అస‌లు గార్డెన్‌కు టిప్పు సుల్తాన్ పేరును గ‌త ప్ర‌భుత్వం లాంఛ‌నంగా జోడించ‌లేద‌ని, దీంతో అక్ర‌మంగా క‌ట్టిన బ్యాన‌ర్‌ను తొల‌గించాల‌ని తాను అధికారుల‌ను కోరాన‌ని చెప్పారు. దీనికి సంబంధించిన ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తామ‌ని తెలిపారు.

ఈ పార్క్‌కు టిప్పు సుల్తాన్ పేరును ఏ ఒక్క‌రూ కోరుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. కాగా టిప్పు సుల్తాన్ పేరు తొల‌గింపుపై ఎన్‌సీపీ మండిప‌డింది. పేర్ల‌ను మార్చుతూ గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను తిర‌గ‌తోడుతూ ఏ ప్ర‌భుత్వం మంచి పేరు తెచ్చుకోలేద‌ని ఆ పార్టీ ప్ర‌తినిధి మ‌హేష్ భ‌ర‌త్ త‌ప‌సి పేర్కొన్నారు.