గోహత్యను నిలిపివేస్తే భూమిపై ఉన్న సమస్యలన్నీ పరిష్కారం

గోహత్యను నిలిపివేస్తే భూమిపై ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి ఎస్‌.వి.వ్యాస్‌ స్పష్టం చేశారు. ఆవు రక్తం భూమిపై పడనిరోజున భూగోళంలోని సమస్యలన్నీ పరిష్కారమై ధరిత్రి సుభిక్షంగా వర్ధిల్లుతుందని చెప్పారు. ఆవు నుండి మతం పుడుతుందని, మతం వృషభ రూపంలో ఉందని, ఆవు కుమారుడిని వృషభం అని పిలుస్తారని వివరించారు.
 
అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ, గుజరాత్‌లోని తాపీ జిల్లా కోర్టు న్యాయమూర్తి గోవధపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  ఆవు మతపరమైన అంశాన్ని మాత్రమే కాకుండా దాని సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలను కూడా పరిగణించాలని న్యాయమూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆవులు అంతరించిపోతే విశ్వం కూడా అంతరించి పోతుందని పేర్కొంటూ మొత్తం ఆరు అవయవాలతో కూడిన వేదాలకు ఆవులే కారణమని సూచించే సంస్కృత శ్లోకాన్ని కూడా కోర్టు ఉటంకించింది. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరిసంపదలు, సంతోషాలు మాయమవుతాయని హెచ్చరించారు.

ఆవు శివుడికి తల్లి. వసుకి కుమార్తె.. అదితి పుత్రులకు సోదరి అని జడ్జి చెప్పారు. ఆవులను చంపడం అనుమతించబడదని కోర్టు స్పష్టం చేసింది. గోహత్య, అక్రమ రవాణా ఘటనలు నాగరిక సమాజానికి అవమానకరమని పేర్కొంటూ మరొక శ్లోకాన్ని వివరించారు. ఆవు ఒక జంతువు మాత్రమే కాదు, తల్లి కూడా. ఆవు 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతల సజీవ గ్రహం అని తెలిపారు.

ఆవుల సంరక్షణ, పెంపకం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ, ఆచరణలో పెట్టడం లేదని న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవు పేడతో చేసిన ఇళ్ళు అణు వికిరణం ద్వారా ప్రభావితం కావని, గోమూత్ర (ఆవు మూత్రం) వాడకం అనేక నయం చేయలేని వ్యాధులకు నివారణ అని జస్టిస్‌ సమీర్‌ వినోద్‌చంద్ర వ్యాస్‌ వివరించారు.

గోవధను వాతావరణ మార్పులకు కూడా జడ్జి ముడిపెట్టారు. ఈ రోజు ఉన్న సమస్యలకు ఆవేశం, కోపం పెరగడమే కారణం. ఇలాంటివి పెరగడానికి ఏకైక కారణం గోవుల వధ మాత్రమే. దీనిని పూర్తిగా నిషేధించే వరకు సాత్విక వాతావరణ మార్పు ప్రభావం చూపదు అని పేర్కొన్నారు.

గత ఏడాది ఆగస్టులో 16 ఆవులను అక్రమంగా రవాణా చేయడంపై ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. జీవిత ఖైదుతో పాటు, ఆ వ్యక్తికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు. పశువులు కూర్చోవడానికి, తినడానికి లేదా త్రాగడానికి సరైన ఏర్పాట్లు లేకుండా ప్యాక్‌ చేసిన ట్రక్కులో 16 ఆవులను, దాని సంతానాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు మహ్మద్‌ అమీన్‌ను 2020 ఆగస్టు 27న పోలీసులు అరెస్టు చేశారు.

అతను గుజరాత్‌ జంతు సంరక్షణ (సవరణ) చట్టం, 2017, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం, 1960, గుజరాత్‌ కంట్రోల్‌ ఆఫ్‌ యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్డర్‌, 1975, గుజరాత్‌ ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ అండ్‌ యానిమల్‌ కంట్రోల్‌ యాక్ట్‌, 2015 నిబంధనల ప్రకారం అతనిపై కేసు నమోదైంది