బైడెన్‌ ఇంట్లో 13 గంటల సోదాలు‌.. మరో 6 రహస్య ఫైళ్లు లభ్యం

రహస్య ఫైల్స్‌ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మెడకు చుట్టుకుంటున్నాయి. గతంలో పలు రహస్య ఫైల్స్‌ లభ్యమవగా, ఆయన ప్రైవేట్‌ హైస్‌లో చేపట్టిన మరో సోడాలో ఇంకో 6 ఫైళ్లు దొరికాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 13 గంటలపాటు డెలావేర్‌లోని బైడెన్‌ ఇంట్లో అధికారులు సోడా చేశారు.
 
ఈ ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. డెలావేర్‌లోని ఇంట్లో సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్‌గానీ, ఆయన భార్యగానీ ఇంట్లో లేరు.  శుక్రవారం బైడెన్‌ ఇంట్లో దొరికిన పత్రాల్లో కొన్ని ఆయన సెనేటర్‌గా ఉన్న కాలంనాటివిగా గుర్తించారు. మరికొన్ని ఆయన గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనివిగా నిర్ధారించారు.
 
సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన లీగల్‌ టీమ్‌లు, వైట్‌హౌస్‌ అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. బైడెన్‌ లివింగ్‌ రూం మొదలుకొని గ్యారేజి వరకు మొత్తం ఇంటిని శోధించారు. ఈ సోడాలో ఇంటెలిజెన్స్‌ ఫైల్స్‌తో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని నోట్స్‌ కూడా లభించినట్లు తెలుస్తున్నది.జో బైడెన్ స్వయంగా న్యాయ శాఖ అధికారులను పిలిచి ఇంటిని మరోసారి సోదా చేయించారని న్యాయవాది బాబ్ బోయర్ తెలిపారు. ఇంట్లో సోదా పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని బహిరంగపరచవద్దని న్యాయ శాఖ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా, సోదాలకు ఒకరోజు ముందు బైడెన్‌ మాట్లాడుతూ ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదని తెలిపారు.

దీనిని ప్రతిపక్ష రిపబ్లికన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది తెలివితక్కువ ప్రకటన అని వారు పేర్కొన్నారు. బైడెన్‌ ఇంటిని ఖాళీ చేస్తున్న సమయంలో గత నవంబర్‌ నెలో 20 సెట్ల రహస్య ఇంటెలిజెన్స్‌ ఫైళ్లు లభించడంతో వివాదం మొదలైంది. పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విధంగా రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధంగా అమెరికా ప్రభుత్వం పరిగణిస్తుంది.