
భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి హాజరు కానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 26న జరిగే 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి హాజరవుతున్నట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈజిప్ట్ నుంచి ఓ నేత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.
భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు జనవరి 24న ఈజిస్టు అధ్యక్షుడు ఢిల్లీ చేరుకుంటారు. 25వ తేదీన ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో సమావేశమవుతారు. అదేరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ పూర్వకంగా ఇచ్చే విందుకు ఆయన హాజరవుతారు.
26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అబ్దెల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ పరేడ్‌లో ఈజిప్ట్ నుంచి వచ్చిన 180 మంది సభ్యులతో కూడిన బృందం పాల్గొననుంది. ఈ సందర్భంగా 75 సంవత్సరాల భారత్-ఈజిప్టు దౌత్య సంబంధాలకు గుర్తుగా స్మారక స్టాంపును విడుదల చేయనున్నారు.
భారత రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించిన నేపథ్యంలో, 2023 జనవరి 26న భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అందుకు సన్నద్ధతలు మొదలయ్యాయి. నవీకరించిన కర్తవ్య పథ్(ఇదివరలో రాజ్‌పథ్ అనేవారు)లో గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ జరిగాయి. ఆ రోడ్డు నడవ ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉంటుంది.
ఈ కవాతు భారత సైనిక శక్తి పాటవాన్ని, దేశ సంస్కృతి వైభవాన్ని చాటుతాయి. ఈ రిహార్సల్స్ సందర్భంగా భారత యుద్ధ విమానాలైన జాగ్వార్ విమానాలను ఓ పద్ధతిలో ఆకాశంలో నడిపారు. భారత వైమానిక దళానికి చెందిన సి130 హర్య్యూల్స్, నాలుగు రాఫెల్ జెట్ విమానాలను కూడా ఓ ఫార్మేషన్‌లో నడిపారు. పంజాబ్ పోలీస్ సిబ్బంది కూడా రిహార్సల్స్‌లో పాల్గొన్నారు.
More Stories
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
ఐఎస్ఐ కోసం గూఢచర్యంలో యూట్యూబర్ వసీం అరెస్ట్