బడ్జెట్‌ ప్రాధాన్య రంగాల్లో ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలు!

కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్య రంగాల జాబితాలో ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి. కరోనా మహమ్మారి పరిణామాలు ఆరోగ్య రంగ విస్తరణ, అభివృద్ధి అవసరాలను స్పష్టం చేశాయి. అదే సమయంలో మహమ్మారి పరిస్థితుల అంతరాయాల నుండి తయారీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈనేపథ్యంలో తయారీ పరిశ్రమ కార్యకలాపాలను పునరుజ్జీవింపజేసేందుకు బడ్జెట్‌ 2023 దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
 
హెల్త్‌కేర్‌ రంగం పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు చేయాలని కూడా ఆశిస్తోంది. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను తయారు చేయడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి బడ్జెట్‌లో అనుమతి ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
 
కరోనా  పెళుసుగా ఉన్న దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను కుదిపేసిన తర్వాత, ఔషధ పెట్టుబడులను విస్తరించడంలో కొత్త ఆసక్తి ఏర్పడింది. టీకాలు, ఔషధాల కోసం గత రెండేళ్లలో ప్రాముఖ్యతను సంతరించుకున్న పరిశ్రమ మెరుగైన నిధులు, నిర్దిష్ట విధానాలు, మందులపై పన్ను మినహాయింపుల కోసం ఎదురుచూస్తోందని చెబుతున్నారు.
 
కరోనాతో పాటు ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు వినూత్న పరిష్కారాలను అందించడంలో బడ్జెట్‌ 2023 ముఖ్యమైనది కాబట్టి పబ్లిక్‌ హెల్త్‌కేర్‌పై ఖర్చు చేయడం తక్షణమే పరిశీలించాలని నిపుణులు తెలిపారు. 2023-24లో భారతదేశం ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేయడంతో, తయారీ పరిశ్రమ నిపుణులు బడ్జెట్‌ నుంచి ఎక్కువగా ఆశిస్తున్నారు.
 
 యంత్ర పరికరాల పరిశ్రమను వేగవంతం చేయడానికి సబ్సిడీలు, పథకాలు ఉండాలని సూచిస్తున్నారు. స్థానిక తయారీదారులను ప్రోత్సహించాలని, స్థిరమైన, వినూత్న పద్ధతులను అనుసరించే కంపెనీలకు ప్రభుత్వం రివార్డ్‌ ఇవ్వాలని కోరుతున్నారు.