పాత పెన్ష‌న్ విధానం పునరుద్ధరిస్తే ప్రభుత్వ వనరులపై వత్తిడి

పాత పెన్ష‌న్ విధానాన్ని (ఓపీఎస్‌) పున‌రుద్ధ‌రిస్తే ప్ర‌భుత్వ ఆర్ధిక వ‌న‌రుల‌పై మున్ముందు తీవ్ర ఒత్తిడి ప‌డుతుంద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చ‌రించింది.  కొన్ని రాష్ట్రాలు పాత పెన్ష‌న్ విధానాన్ని (ఓపీఎస్‌) పున‌రుద్ధ‌రించ‌నుండటంతో ఆర్ధిక ముఖ‌చిత్రంలో పెను ముప్పు వాటిల్ల‌నుంద‌ని, ఈ చ‌ర్య‌తో ఆర్ధిక వ‌నరుల పొదుపు దీర్ఘ‌కాలం మ‌న‌జాల‌ద‌ని ప్ర‌భుత్వ వ‌న‌రులు : 2022-23 బ‌డ్జెట్ల‌పై అధ్య‌యనం పేరుతో వెల్ల‌డించిన ఆర్‌బీఐ నివేదిక స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుత ఖ‌ర్చుల‌ను భ‌విష్య‌త్‌కు వాయిదా వేయ‌డం ద్వారా రాబోయే సంవ‌త్స‌రాల్లో కేటాయింపులు కొర‌వ‌డిన పెన్ష‌న్ బ‌కాయిల‌ను స‌ర్ధుబాటు చేయ‌డం రాష్ట్రాల‌కు ముప్పుగా ప‌రిణ‌మిస్తుంద‌ని కేంద్ర బ్యాంక్ త‌న నివేదికలో పేర్కొంది. ప‌లు రాష్ట్రాలు ఓపీఎస్‌ను పునరుద్ధ‌రిస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్న నేప‌ధ్యంలో ఆర్‌బీఐ తాజా నివేదిక వెలువ‌డింది.

హిమాచల్ ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల కొలువుతీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం డీఏ ఆధారిత ఓపీఎస్ పునరుద్ధ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించగా, రాజ‌స్ధాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, జార్ఖండ్ రాష్ట్రాలు త‌మ ఉద్యోగుల‌కు ఓపీఎస్ అమలు చేస్తామ‌ని కేంద్రంతో పాటు పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ)కి స‌మాచారం అందించాయి.

పంజాబ్‌లోనూ ఆప్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఓపీఎస్ అమలు చేసేందుకు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇక 2004లో అప్ప‌టి మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వం నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌) ప్ర‌వేశ‌పెట్టింది. గత నవంబర్‌లో పంజాబ్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. అయితే, పలు రాష్ర్టాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తారా? అని కేంద్రాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నించగా, ఆ ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేసింది.