
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏ-1గా ఉన్న కీలక నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా బెయిల్ రద్దు చేయాలా? లేదా? అన్నది నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో గంగిరెడ్డి బెయిల్ రద్దుపై మెరిట్స్ ఆధారంగా ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోలేదని సుప్రీం అభిప్రాయపడింది.
వివేకా హత్య కేసులో డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలని గతంలో సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 5న దీనిపై వాదనలు ముగియగా తీర్పును రిజర్వ్లో ఉంచిన సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించి తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
గతంలో వివేకా హత్య కేసును ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై కూడా తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతుందంటూ సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దర్యాప్తుకు గంగిరెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని, బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని గంగిరెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు.
అయితే ఏపీ పోలీసుల చేతులో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు గంగిరెడ్డికి బెయిల్ వచ్చిన అంశాన్ని సీబీఐ ప్రస్తావించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టుకు బెయిల్ పిటిషన్ను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. త్వరలోనే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం